యువికాతో యంగ్‌ సైంటిస్టులు | - | Sakshi
Sakshi News home page

యువికాతో యంగ్‌ సైంటిస్టులు

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:35 PM

శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇస్రో చక్కటి అవకాశం
● 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ● ఫిబ్రవరి 24నుంచి ఈనెల 23వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ● కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

మెదక్‌జోన్‌: అంతరిక్ష పరిశోధన రంగంలో ఆసక్తి, భావి శాస్త్రవేత్తలు కావాలనుకుంటున్న విద్యార్థులకు భారత ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష పరిశోధన– యువవిజ్ఞాన్‌ కార్యక్రమం (ఐఎస్‌ఆర్‌డీ–యువికా) ద్వారా విద్యార్థులను యువశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువికా కార్యక్రమంలో చేరేందుకు ఇస్రో అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి, అభిరుచి ఉన్న విద్యార్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 23 తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇస్రో అవకాశం కల్పించింది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు http://jigyasa.iirs.gov.in/yuvika ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

జిల్లాలోని అన్ని పాఠశాలలకు సమాచారం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఐఎస్‌ఆర్‌డీ) పాఠశాల విద్యార్థుల కోసం యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో 2019 నుంచి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత, అంతరిక్షశాస్త్రంపై వాటిని నిజజీవితంలో ఉపయోగించుకోవడం వంటి ప్రాథమిక జ్ఞానం అందించడమే లక్ష్యంగా అవగాహన కల్పిస్తారు. మెదక్‌ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్ని పాఠశాలల యాజమాన్యాలకు ఈ సమాచారాన్ని విద్యాశాఖ అధికారులు చేరవేశారు.

ఎంపికై న విద్యార్థులకు అవగాహన

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు సంబంధించి ఏప్రిల్‌ 7న జాబితా విడుదల అవుతుంది. మే 19 నుంచి మే 30 వరకు ఇస్రోకు చెందిన 7 కేంద్రాలలో ఏదోఒక సెంటర్‌ను కేటాయిస్తారు. ఇందులోభాగంగా అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌, శ్రీహరికోట, తిరువనంతపురం, బెంగళూర్‌, షిల్లాంగ్‌తోపాటు హైదరాబాద్‌ తదితర కేంద్రాల్లో ఎంపికై న విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఇందులో ప్రధానంగా అంతరిక్షం, సాంకేతికత, అంతరిక్షశాస్త్రం (ఖగోళశాస్త్రం) (అస్ట్రానమీ)పై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు. అంతేకాకుండా అంతరిక్ష కేంద్రాల్లోని ప్రయోగశాలల సందర్శన అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశం, ముఖాముఖి చర్చలు, రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు.

సద్వినియోగం చేసుకోవాలి

చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి భావిభారత శాస్త్రవేత్తలుగా తయారయ్యేందుకు ఇస్రో కల్పించిన ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ విషయాన్ని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి.

–రాజిరెడ్డి, జిల్లా సైన్స్‌ అధికారి మెదక్‌

ఎంపిక విధానం ఇలా..

8వ తరగతిలో సదరు విద్యార్థికి వచ్చిన మార్కులను 50 శాతంగా తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే క్విజ్‌ ప్రతిభకు 10 శాతం, ఇంతకుముందు పాల్గొన్న జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌లకు 10, ఒలంపియాడ్‌లో పాల్గొన్న వాటికి ఐదు, స్పోర్ట్స్‌లో పాల్గొన్న వారికి 5 , ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌లో పాల్గొన్న వారికి 5, గ్రామీణప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులకు 15 శాతం మార్కులను కలిపి ఎంపిక చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement