గాలి, వాన బీభత్సం
● 15 నిమిషాల పాటు అతలాకుతలం ● విరిగిపడిన విద్యుత్ స్తంభాలు ● నేలకొరిగిన చెట్లు, దెబ్బతిన్న వాహనాలు
కొల్చారం(నర్సాపూర్): అప్పటివరకు ఉక్కపో తతో ఇబ్బందిపెట్టిన వాతావరణం అంతలోనే మారిపోయింది.. మండలంలోని పోతంశెట్టిపల్లి శివారులో శుక్రవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టించింది. 15 నిమిషాల పాటు అతలాకుతలం చేసింది. భారీ వృక్షాలు నేలకొరిగాయి.. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మెదక్– నర్సాపూర్ జాతీయ రహదారి, మెదక్– జోగిపేట రహదారిపై పలుచోట్ల చెట్లు విరిగి నిలిచి ఉన్న వాహనాలపై పడడంతో దెబ్బతిన్నాయి. రోడ్డుకు అడ్డంగా పడటంతో అరగంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కరెంట్ స్తంభాలు విరిగి కిందపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏడుపాయల టీ జంక్షన్ ప్రాంతంలోని పలు హోటళ్లపై చెట్టు విరిగిపడింది. రేకుల గాలికి లేచిపోయి సమీప పొలాల్లో పడ్డాయి. సమీపంలోని జాతీయ రహదారి పక్కన పొలాల్లో తాత్కాలిక గుడారాలు వేసుకుని ఉన్న వలస కూలీలపై పడటంతో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఎస్‌ఐ మహమ్మద్ గౌస్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఇంటిపై పడిన పిడుగు
మెదక్‌జోన్: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మెదక్‌లోని భవానీనగర్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి వడియారం యాదయ్య ఇంటిపై పిడుగు పడింది. దీంతో భవనం స్వల్పంగా దెబ్బతింది. పిడుగుపాటుకు అతడి మనమరాలు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. కాగా గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో కొంతమేర పంటలకు మేలు జరగగా, కోతకు వచ్చిన వరి పంటలకు నష్టం జరిగింది.
గాలి, వాన బీభత్సం
గాలి, వాన బీభత్సం
గాలి, వాన బీభత్సం


