అదనపు కలెక్టర్ నగేష్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో 496 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలిసి హార్వెస్టర్ల యజమానులతో వరి కోతలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు సమన్వయంతో వ్యవహరించి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. పొలం పూర్తిగా కోత దశకు వచ్చిన తర్వాతే యంత్రాలు వినియోగించి పంట కోయించాలని సూచించారు. హార్వెస్టర్ యజమానులు బ్లోయర్ ఆన్‌లో ఉంచాలన్నారు. పంట పూర్తిగా కోతకు వచ్చిన తర్వాత కోయడం ద్వారా తేమశాతం, తాలు, గడ్డి లేకుండా నాణ్యమైన పంట వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రైతు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులకు తగు సూచనలు ఇవ్వాలని సూచించారు. రైతులు ధాన్యం శుభ్రపరిచిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లాలని చెప్పారు.


