సబ్సిడీ పై సాగు పరికరాలు
● నూతన పద్ధతులలో ప్రోత్సహించేందుకు..
● ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ
● 27వరకు దరఖాస్తుకు అవకాశం
● మండల కమిటీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక
టేక్మాల్(మెదక్): ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోంది. నూతన పద్ధతులతో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024–25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సబ్సిడీకి అర్హులు..
● పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు
● ఎస్సీ, ఎస్టీ రైతులకు 50% రాయితీ, జనరల్ రైతులకు 40% రాయితీ
● లక్ష కన్నా ఎక్కువ లబ్ధి పొందే రైతు ఖచ్చితంగా ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి
యంత్ర పరికరాలు ఇవే..
రైతులకు అందజేయనున్న పరికరాల్లో బ్యాటరీ స్ప్రేయర్‌లు జనరల్ 2, ఎస్సీలకు1, పవర్ స్ప్రేయర్ జనరల్‌కు 3, ఎస్సీలకు 1, రోటవేటర్ జనరల్ 1, సీడ్ కమ్ ఫర్టీలైజర్ డ్రిల్ జనరల్ 1, డిస్క్ హ్యారో జనరల్ 2, ఎస్టీలకు 1, ట్రాక్టర్ ఎస్సీలకు 1 ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎంపిక విధానం ఇలా..
రైతులు దరఖాస్తు చేసుకున్న అనంతరం మండల స్థాయిలో నియమించిన కమిటీ సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఈ కమిటీకి కన్వీనర్‌గా మండల వ్యవసాయాధికారి, మెంబర్లుగా తహసీల్దార్, ఎంపీడీఓలు వ్యవహరిస్తారు.
దరఖాస్తుకు కావాల్సినవి..
ఈ నెల 27వ తేదీలోపు దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్‌కు సంబంధించిన పరికరాలకు ఆర్సీ జిరాక్స్, పాస్ ఫొటో, బ్యాంక్ పాసు పుస్తకం కావాలి. భూమి సారానికి సంబంధించిన సాయిల్ హెల్త్ కార్డు తప్పనిసరి జతచేయాలి.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అందించే రాయితీ పథకాలను గ్రామాల్లోని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకా రం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. రైతులు మరింత సమాచారం కోసం వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించాలి.
– రాంప్రసాద్, ఏఓ, టేక్మాల్


