రోగులకు మెరుగైన వైద్య సేవలు
శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిబ్బంది పూర్తి స్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం శివ్వంపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సిబ్బంది సమయ పాలన పాటిస్తూ, ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. అనంతరం గూడూరులోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌ని కలెక్టర్ తనిఖీ చేశారు. వంటగది నిర్వహణ పరిశుభ్రంగా లేకపోవడంతో సిబ్బంది పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో విద్యా సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పది అనంతరం ఉన్నత చదువులు చదువుకోవాలన్నారు. 18 ఏండ్లు నిండకుండా మైనర్‌లకు పెండ్లి చేస్తే వారి తల్లిదండ్రులతో పాటు భాగస్వాములైన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
కస్తూర్బా గాంధీ హాస్టల్ తనిఖీ


