అదృశ్యమై.. భువనగిరిలో ప్రత్యక్షమై
అధికారులను పరుగులెత్తించిన కేజీబీవీ విద్యార్థిని
పాపన్నపేట(మెదక్): కేజీబీవీలో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని బుధవారం పాపన్నపేటలో అదృశ్యమై.. భువనగిరిలో ప్రత్యక్షం అయింది. పోలీసుల కథనం ప్రకారం.. అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌కు చెందిన దంపతులకు ఒక కుమార్తె (15) ఉంది. కొంతకాలం క్రితం తండ్రి మరణించడంతో తల్లి, కూతురు భువనగిరి ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ కూతురును మొదట భువనగిరిలోని కేజీబీవీలో చేర్పించి తర్వాత పట్టించుకోవడం మానేసింది. దీంతో బాలికను అధికారులు కొంతకాలం అక్కడి బాల సదనంలో చేర్పించారు. అక్కడి నుంచి మెదక్ బాలసదనం తీసుకొచ్చారు. ఈఏడాది పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో చేర్పించారు. అయితే జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో బుధవారం అటెండెన్స్ తీసుకున్న అనంతరం అదృశ్యమైంది. వెంటనే విషయాన్ని గుర్తించిన ఎస్‌ఓ బాలలక్ష్మి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. డీఈఓ రాధాకిషన్, ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి పాపన్నపేట కేజీబీవీకి చేరుకొని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే సాయంత్రం బాలిక భువనగిరి బాలసదనం చేరుకోవడంతో వారు అక్కడి సఖి కేంద్రంలో అప్పగించారు. విషయాన్ని పోలీసులు, అధికారులు ధృవీకరించారు. పొద్దంతా ఉరుకులు పరుగులతో ఆందోళన చెందిన అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


