గోదాముల్లో గోల్‌మాల్!
గోదాం ఇన్‌చార్జిల అక్రమాలు
● ఐదేళ్లలో 11 వేల క్వింటాళ్ల బియ్యం మాయం ● 19 లక్షల గన్నీబస్తాలు విక్రయం ● రూ. 15.67 కోట్ల ప్రభుత్వ సొమ్ము పక్కదారి ● సస్పెండ్ అయిన వారే మళ్లీ విధుల్లోకి..
మెదక్ కేంద్ర గిడ్డంగుల సంస్థ
కంచె చేను మేసిన చందంగా.. పేద ప్రజలు తినే బియ్యాన్ని నిల్వ ఉంచే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు రక్షణ కల్పించాల్సిన గోదాం ఇన్‌చార్జిలు అడ్డదారి తొక్కారు. వేలాది క్వింటాళ్ల బియ్యంతో పాటు లక్షలాది గన్నీ బస్తాలను అమ్ముకున్నారు. ఐదేళ్ల వ్యవధిలో రూ. 11.67 కోట్ల విలువ చేసే ప్రభుత్వ సొమ్మును మింగారు. అయినా వారి నుంచి ఆర్‌ఆర్‌యాక్ట్ కింద ఒక్కపైసా రికవరీ చేయలేకపోయారు. విచిత్రమేమిటంటే సస్పెండ్ అయిన వారే మళ్లీ విధుల్లో చేరుతున్నారు.
–
మెదక్‌జోన్ : జిల్లావ్యాప్తంగా పెద్దశంకరంపేట, పాపన్నపేట, చేగుంట, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్‌లో మొత్తం 7 ఎంఎల్‌ఎస్ స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో గత ఐదేళ్ల కాలంలో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట నాలుగు (ఎంఎల్‌ఎస్) స్టాక్ పాయింట్లలో ఐదుగురు గోదాం ఇన్‌చార్జిలు విధులు నిర్వర్తించారు. వీరు పోటీ పడి మరి ఐదేళ్ల కాలంలో 11,086.66 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టించారు. అంతేకాకుండా 19,44,200 లక్షల గన్నీ బస్తాలను అమ్ముకున్నారు. వీటి విలువ అక్షరాల రూ. 15,67,90,862 కోట్లు. అయితే ఆలస్యంగా పసిగట్టిన ఉన్నతాధి కారులు విచారణ జరిపి సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు ఈవిషయా న్ని అప్పట్లో బట్టబయలు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పైసా రాబట్ట లేదు..
గోదాంల ఇన్‌చార్జిలు ఐదుగురి నుంచి రూ. 15.67 కోట్ల ప్రజాధనాన్ని ఆర్‌ఆర్‌యాక్ట్ ఉపయోగించి తిరిగి కక్కిస్తామని గతంలో అధికారులు చెప్పారు. కానీ ఇప్పటివరకు వారి నుంచి పైసా రికవరీ చేయలేదు. కేసులు నమోదు చేసి జైలుకు పంపగా, బెయిల్‌పై తిరిగి వచ్చి యథావిధిగా విధుల్లో చేరుతున్నారు. ఐదుగురు నిందితుల్లో ఇప్పటికే ఇద్దరు విధుల్లో చేరగా, మరో ముగ్గురు ఉద్యోగంలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
తాజాగా 35 క్వింటాళ్ల బియ్యం
నమ్మకానికి మారుపేరైనా కేంద్ర గిడ్డంగుల సంస్థ నుంచి తాజాగా మార్చి 31వ తేదీన 35 క్వింటాళ్ల బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా డీసీఎంలో తరలించారు. గమనించిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మెదక్ పట్టణ పోలీసులు వాహనాన్ని వెంబడించి అదుపులోకి తీసుకొన్నారు. తమదైన శైలిలో విచారణ జరిపి డ్రైవర్‌తో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు. కాగా కేంద్ర గిడ్డంగుల అధికారి ఆదేశాల మేరకే తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.
గోదాంలో తనిఖీలు
కేంద్ర గిడ్డంగుల సంస్థ గోదాం నుంచి మార్చి 31వ తేదీన 35 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలించిన విషయమై మంగళవారం ‘సాక్షి’లో ‘దొంగ చేతికి’ తాళం అనే కథనం ప్రచురితమైంది. దీనిని స్పందించిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) సిబ్బంది బుధవారం గోదాంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో బియ్యం తక్కువగా వచ్చినట్లు నిర్ధారించారు. ఈ విషయమై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎఫ్‌సీఐ ఇంటెలిజెన్స్ సిబ్బంది తెలిపారు. కాగా వారి పేర్లు తెలిపేందుకు వారు నిరాకరించారు.
గోదాముల్లో గోల్‌మాల్!


