అభివృద్ధి నిరోధకులుగా మారొద్దు
వెల్దుర్తి(తూప్రాన్): ప్రభుత్వం ఎవరిదైనా ఎమ్మె ల్యేగా తాను ప్రపోజల్స్ పంపిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మంజూరు వస్తుందని, అధికార పార్టీ నాయకులకు చేతనైతే అదనపు నిధులు తేవాలి కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు పలికారు. గురువారం మాసాయిపేట మండలంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే రెండు రోజుల తర్వాత మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు అధికారులు తెలపడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా సమాచారం ఇచ్చి అర్ధాంతరంగా చెక్కుల పంపిణీ నిలిపివేసినందుకు నిరసనగా నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారు. పక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేస్తున్నారు, నర్సాపూర్‌లో మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నిధు ల విడుదలలోనూ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. తన హక్కులను కాలరాసేలా ప్రవర్తిస్తే చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి నాయకులు నర్సింలు, నాగరాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే సునీతారెడ్డి హితవు


