
రాజ్యాంగ పరిరక్షణకు కదలిరావాలి
వెల్దుర్తి(తూప్రాన్): అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని, దానిని అడ్డుకుని తీరాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో నాయకులు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ కబంధహస్తాల కింద దేశం నలిగిపోకుండా కాపాడాలన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ స్వాతంత్య్రం కోసం ఆవిర్భవించిన పార్టీ అయితే బీజేపీ కేవలం మతపరమైన పార్టీ అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణు లు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సుధాకర్‌గౌడ్, మల్లేశం, శ్రీశైలం, శేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.