
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
వడ్లకుప్పలను ఢీకొనడంతో ప్రమాదం
నిజాంపేట (మెదక్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి నిజాంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాలాపూర్‌కు చెందిన అబ్దుల్ రహ్మాన్ (50) ఫోన్ రావడంతో చేగుంట మండలం పులిమామిడికి బైక్‌పై బయలుదేరాడు. గ్రామ శివారులో రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలను ఢీకొనడంతో కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలొదిలాడు. రహ్మాన్ మరణ వార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చదవడం, రాయడం తప్పనిసరి
చేగుంట(తూప్రాన్): విద్యార్థులకు చదవడం రాయడం వచ్చేలా శిక్షణ ఇవ్వాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం మండలంలోని వడియారం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చదవడం, రా యడం ఖచ్చితంగా రావాలన్నారు. గణితంలో చతుర్విద ప్రక్రియలకు అనుగుణంగా బోధించాలని సూచించారు. తొలిమెట్టు మూల్యంకన ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. డీఈఓ వెంట ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు ప్రియదర్శిని, ఉపాధ్యాయులు వసంత, సంతోషిమాత తదితరులు ఉన్నారు.
సమగ్ర వివరాలు
నమోదు చేయాలి
శివ్వంపేట(నర్సాపూర్): రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సంబంధించి సమగ్ర వివరాలు నమోదు చేయాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అన్నారు. గురువారం శివ్వంపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న పత్రాలను కార్యాలయంలో తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివరాలు నమోదుకు ప్రత్యేక రిజిస్టర్ ఏర్పాటుచేయాలన్నారు. అలాగే ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచే విధంగా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆయన వెంట కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నరేందర్‌రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ స్వామి, ఏపీఓ అనిల్‌కుమార్ ఉన్నారు.
నకిలీ విత్తనాలు
అమ్మితే కఠిన చర్యలు
రామాయంపేట(మెదక్): నాసిరకం విత్తనాలు, క్రిమి సంహారక మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ హెచ్చరించారు. గురువారం రైతు వేదికలో డివిజన్ పరిధిలోని రామాయంపేట, నిజాంపేట, చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన విత్తనాలు, క్రిమి సంహారక మందుల డీలర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విత్తన చట్టాలకు లోబడి డీలర్లు వ్యాపారం నిర్వహించుకోవాలని, నెలవారీ నివేదికలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. విత్తనాలు, క్రిమి సంహారక మందులకు సంబంధించి అమ్మకాలు, నిల్వల వివరాలను ప్రతినెల తప్పనిసరిగా అందజేయాలని ఆదేశించారు. ఏఓలు సోమలింగారెడ్డి, యాదగిరి, ఏఈఓ ప్రవీన్, డీలర్లు పాల్గొన్నారు.
మహనీయుడు వాజ్‌పేయి
మెదక్‌జోన్: దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి గొప్ప నేత అని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయి శత జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనెల 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు నిర్వహించాల్సిన కార్యక్రమాలను వివరించారు. జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నేతలు శివ, విజయ్, ప్రసాద్ పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి