నెరవేరేనా..!
సొంతింటి కల
పేద, మధ్య తరగతి ప్రజలను ఊరిస్తున్న సొంతింటి కల అందని ద్రాక్షగానే మారింది. గత ప్రభుత్వంలో 688 డబుల్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ పంపిణీకి నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడమూ లేదు. ఈ క్రమంలో సొంతింటి నిర్మాణానికి ఇందిరమ్మ పథకాన్ని ప్రకటించింది. దీంతో ఎంతో మంది అర్హులు అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఆ ప్రక్రియ సైతం ముందుకు సాగడం లేదు. – మెదక్‌జోన్
జిల్లాలో దశాబ్ద కాలంగా ప్రభుత్వం పేదలకు సరిపడా ఇళ్లు మంజూరు చేయలేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు 4,776 డబుల్ బెడ్రూం ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 3,975 ఇళ్లకు మాత్రమే టెండర్ పూర్తయింది. వీటి నిర్మాణం కోసం అప్పటి ప్రభుత్వం రూ. 243 కోట్లను విడుదల చేసింది. టెండర్ అయిన వాటిలో 3,011 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా లబ్ధిదారులకు 2,323 ఇళ్లను మాత్రమే పంపిణీ చేసింది. ఈ లెక్కన నిర్మాణాలు పూర్తయినవి మరో 688 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. వాటికి చిన్నచిన్న మరమ్మతులు మాత్రమే చేయాల్సి ఉంది. అయితే కొత్త ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలపై మాత్ర మే దృష్టి సారించింది. ప్రజాపాలనలో ఇళ్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో జిల్లాలో లక్షపై చిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలోని అర్హులకు ఇళ్లు మంజూరు చేశారు. 21 మండలాల పరిధిలోని 21 గ్రామాలను ఎంపిక చేసి 1,555 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. వారికి జన వరి 26న మంజూరు పత్రాలను అందించారు. అయితే ఇప్పటివరకు మూడు నెలలు అవుతున్నా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జిల్లాలో 493 గ్రామాలు ఉండగా, ఇప్పటివరకు కేవలం 21 గ్రామాల్లోనే ఈ పథకాన్ని అమలు చేశారు. మిగితా గ్రామాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు పూర్తయిన 688 ఇళ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని అడుగుతున్నారు.
ఏళ్లుగా తప్పని ఎదురుచూపులు గత ప్రభుత్వంలో నిర్మించిన688 ఇళ్లు పంపిణీకి సిద్ధం వాటి ఊసే ఎత్తని పాలకులు,అధికారులు ముందుకు సాగని ఇందిరమ్మఇళ ్ల నిర్మాణం
ఆసక్తి చూపని లబ్ధిదారులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. మూడు నెలల క్రితం జిల్లాలోని 21 గ్రామాలకు 1,555 ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 34 మంది లబ్ధిదారులు మాత్రమే బెస్‌మెంట్ లెవల్ వరకు నిర్మించుకున్నారు. మరో 120 మంది పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన డబుల్ బెడ్రూం ఇంటిలో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండగా, వాటిని పిల్లర్లతో నిర్మించారు. ఇందిరమ్మ ఇంటిలో కేవలం ఒక బెడ్రూం మాత్రమే ఉండగా, అందులో పిల్లర్లు లేకుండా నిర్దేశించిన డిజైన్‌లోనే కట్టుకుంటే బాగుంటుందని అధికారులు చెబుతు న్నారు. కనీసం 400 చదరపు అడుగుల నుంచి అత్యధికంగా 600 చదరపు అడుగుల వరకు ఇంటిని నిర్మించుకోవాలని సూచిస్తు న్నారు. అయితే 400 చదరపు అడుగుల ఇంటిని నిర్మించుకుంటే ఏ మాత్రం సరిపోదనే భావనతో చాలా మంది లబ్ధిదారులున్నారు.


