సర్కారు వైద్యం గాలిలో దీపం
పెద్దాస్పత్రిలో అరకొర వైద్య సేవలు
మెడికల్ కళాశాల మంజూరైన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు మెరుగుపడలేదు. కొందరు వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చీరాని వైద్యంతో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
– మెదక్‌జోన్
మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం సర్దన గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ గత నెల 5న దాయరవీధిలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. నైట్‌డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది తుంటి ఎముక విరిగిందని నిర్ధారించారు. ముందుగా యూరిన్ పైపు వేసి చికిత్స ప్రారంభిస్తామన్నారు. అయితే మూత్రనాలంలో పైపు వేసేందుకు అరగంట ప్రయత్నించి విరమించుకున్నారు. ఉదయం మూత్రనాలంలో పైపు వేస్తుండగా రక్తం వస్తుందని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్య పరీక్షలు చేసి మూత్రనాలంలో పైపు సరిగా వేయకపోవటంతో తీవ్రగాయం అయిందని చెప్పారు. ఆపరేషన్ చేసి పైపు ద్వారా యూరిన్ బయటకు తీశారు. అనంతరం విరిగిన ఎముకకు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. అయితే మొత్తం ఆస్పత్రి ఖర్చు రూ. 2.50 లక్షలు అయిందని బాధితుడు వాపోయారు. కాగా సదరు ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జి సమ్మరిలో యూరిన్ పైపు సరిగా వేయకపోవటంతో మూత్రం నాళం లోపల దెబ్బతిందని ఇచ్చారు. అలాగే చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన యాదగిరి గత నెల 22న తలకు బలమైన గాయం కావటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేరారు. సీటీస్కాన్ చేయించుకొని రావాలని డ్యూటీ డాక్టర్ క్షతగాత్రుడి తలకు పట్టి కట్టి పంపించాడు. రక్తం అలాగే కారుతుండడంతో కుటుంబీకులు సదరు వైద్యుడిపై మండిపడగా అప్పుడు కుట్లు వేసినట్లు తెలిసింది.
రోగుల ప్రాణాలతో చెలగాటం!
తప్పనిసరి పరిస్థితిలో ‘ప్రైవేట్’కు
సర్కారు వైద్యం గాలిలో దీపం


