గునపం పట్టి.. కదకం తవ్వి
రామాయంపేట(మెదక్): మండలంలోని పర్వతాపూర్ అటవీలో కొనసాగుతున్న ఉపాధి పనులను శనివారం కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. గ్రామం నుంచి కాలినడకన అటవీ ప్రాంతానికి వెళ్లిన ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గునపం పట్టుకొని తవ్వకం చేపట్టారు. కందకాలను పరిశీలించి కొలతలు సేకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులతో అటవీ భూమిలో నీటి మట్టం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీ నుంచి 50 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని, వీరి సంఖ్య 100 పెరగాలని సిబ్బందికి సూచించారు. ఉపాధి కార్డున్న ప్రతి కూలీ పనిలో పాల్గొనాలన్నారు. అనంతరం కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. దారిలో వరి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఎంపీడీఓ సజీలుద్దీన్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.


