కొనుగోళ్లు వేగవంతం చేయండి
డీఎస్‌ఓ సురేష్‌రెడ్డి
కొల్చారం(నర్సాపూర్): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఎస్‌ఓ సురేష్‌రెడ్డి నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని రంగంపేట, సంగాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఎం జగదీష్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూకంలో వ్యత్యాసం ఉండొద్దని నిర్వాహకులను ఆదేశించారు. సంగాయిపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధిక తూకంతో రైతులు నష్టపోతున్నారన్న విషయాన్ని ‘సాక్షి’ డీఎస్‌ఓ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన సంఘం చైర్మన్ వెంకట్‌రెడ్డిని ఫోన్ ద్వారా ఆరా తీశారు. ధాన్యం తూర్పార పట్టకపోవడం వల్లే అధిక తూకం వేయాల్సి వస్తోందని సమాధానమిచ్చారు. దీంతో డీఎస్‌ఓ తూర్పార బట్టిన ధాన్యాన్ని మాత్రమే తూకం వేయాలని, ఏదో ఒక సాకుతో అధిక తూకం వేయడం సరికాదని ఆదేశించారు.


