రజతోత్సవం.. సమాయత్తం
బీఆర్‌ఎస్ సభకు భారీ సన్నాహాలు
● గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం
● ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2లక్షల మందిని తరలించేందుకు కసరత్తు
● సమీక్షలు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్న హరీశ్‌రావు
● సిద్దిపేట నుంచి పాదయాత్రగా యువత
సాక్షి, సిద్దిపేట: బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలకు తరలేందుకు మెతుకుసీమ గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) 24 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ నెల 27న 25 ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2లక్షల మంది గులాబీ దండును తరలించేందుకు సమాయత్తం మవుతున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సమీక్షలను, టెలికాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తూ కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ఉద్యమాల గడ్డ అని మరోమారు సత్తా చాటేందుకు స్థానిక గులాబీ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు.
ముమ్మరంగా ఏర్పాట్లు
ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దాదాపు 2లక్షల మందికి పైగా సభకు వెళ్లేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు. నాయకులకు పలు బాధ్యతలను అప్పగించారు. గజ్వేల్ నుంచి గులాబీ దండును తరలించే పనిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ప్రతాప్ రెడ్డి, మాదాసు శ్రీనివాస్‌లు దృష్టి సారించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు తరలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హుస్నా బాద్ నియోజకవర్గం పరిధిలోనే సభ జరుగుతుండటంతో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టారు. అలాగే మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోల్ నుంచి సైతం జన సమీకరణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
జోరుగా వాల్ రైటింగ్
ఎల్కతుర్తి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ పలువురు బీఆర్‌ఎస్ నేతలు ప్రధాన రహదారుల వెంట వాల్‌రైటింగ్ రాయించారు. అలాగే పలువురు బీఆర్‌ఎస్ నేతలు వాల్ పోస్టర్లను రూపొందించి అతికించారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే నాయకులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
తరలివెళ్దాం రండి..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భా రీగా తరలిరావాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం జరిగిన ఉద్యమంలో దుబ్బాక నియోజకవర్గం క్రీయాశీలక పాత్ర పోషించిందన్నారు. కనీవిని ఎరుగని స్థాయిలో జరుగనున్న రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి 15 వేలకు పైగా క్రీయాశీలక కార్యకర్తలు హాజరుఅవుతారన్నారు. సభకు సంభందించి ఇప్పటికే నియోజకవర్గంలోని కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లపై చర్చించామన్నారు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


