
చివరికి నీరెలా?
భారీ వర్షాలు మిగిల్చిన నష్టం నుంచి మెతుకుసీమ ఇంకా తేరుకోలేదు. ఫతేనహర్ కెనాల్‌కు గండి పడి 70 మీటర్ల మేర కట్ట కొట్టుకుపోయినా, ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు. మరో వారం రోజులు వర్షం పడకపోతే కెనాల్‌పై ఆధారపడిన సుమారు 2 వేల ఎకరాల పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది.
– పాపన్నపేట(మెదక్)
ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు అన్నారం– కొత్తపల్లి మధ్య అటవీ ప్రాంతంలోని కుంటలు తెగిపోయాయి. భారీ వరదలతో ఫతేనహర్ కెనాల్ కట్ట తెగిపోయింది. సుమారు 70 మీటర్ల మేర కొట్టుకుపోవడంతో దిగువన కొత్తపల్లి శివారులో ఉన్న పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయి. దీంతో కొత్తపల్లి, లక్ష్మీనగర్, పొడిచన్‌పల్లి, పొడిచన్‌పల్లి తండా, శానాయపల్లి, తుమ్మలపల్లి, గాంధారిపల్లి, ఎల్లాపూర్ పొలాలకు ఘనపురం ఆనకట్ట నీరు అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వరి పంటలకు ఊపిరి అందుతోంది. మరో నాలుగు తడులు అవసరం కానున్నాయి. ఒక వేళ వర్షాలు పడకపోతే సుమారు 2 వేల ఎకరాల పంటల పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల విజ్ఞప్తితో ఇరిగేషన్ ఎస్‌ఈ, ఈఈలు పరిశీలించి వెళ్లారు. అయితే మరమ్మతులకు లక్ష్మీనగర్‌కు చెందిన ఓ నాయకుడు ముందుకొచ్చాడు. కట్టకు కావాల్సిన మట్టిని, అటవీప్రాంతం నుంచి తీసుకురావడంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిచిపోయాయి.
భారీ వర్షాలతో ఫతేనహర్ కెనాల్‌కు గండి
70 మీటర్ల మేర కొట్టుకుపోయిన కాలువ
25 రోజుల కావొస్తున్నా మరమ్మతులు శూన్యం