
ఆగం చేశారు..!
రూ.50వేల వరకు పూర్తి సబ్సిడీ
ఆశ పెట్టారు..
రాజీవ్ యువ వికాసంపై నిరుద్యోగుల ఆవేదన
● నెలాఖరులోగా ‘స్థానిక’ నోటిఫికేషన్
● మరింత వాయిదా పడే అవకాశం
● ఆందోళనలో లబ్ధిదారులు
జిల్లాలో యూనిట్ల వివరాలు
మొత్తం యూనిట్లు 10,687
లింకేజీ లేకుండా 3,498 యూనిట్లు
రూ.లక్షలోపు రుణాలు 2,632 యూనిట్లు
రూ. 2లక్షల వరకు 2261 యూనిట్లు
రూ.4 లక్షల వరకు 2,205 యూనిట్లు
మైనర్ ఇరిగేషన్‌కు అదనంగా మరో 51 యూనిట్లు
దరఖాస్తులు : 32,638
మెదక్ కలెక్టరేట్: రాజీవ్ యువ వికాసం పథకం సరిగా అమలు కావడం లేదు. ఆశావహులు దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా.. పురోగతి కనిపిండం లేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిస్తాం... అప్పడిస్తామంటూ ఆశ పెట్టి తమను ఆగం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. డబ్బులొస్తే ఉన్న ఉపాధి అవకాశాలు మెరుగు పరుచుకుందామమన్న ఆశలు అడియాశలయ్యాయి. పైగా నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం నేపథ్యంలో లబ్ధిదారుల్లో మరింత గుబులు రేకెత్తిస్తోంది. అప్పటిలోగా రుణాలిస్తారా? లేక ఆశ చూపి ఆగం చేస్తారోనన్న వారిని పట్టి పీడిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా రుణాలిచ్చి స్వయం ఉపాధికి మార్గం చూపాలని మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధికి చెందిన నిరుద్యోగ యువకుడు దానోల్ల క్రాంతి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఎన్నో ఆశలతో..
ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని మే నెలలో ప్రారంభించి 18 నుంచి 55 యేళ్లలోపు నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటన చేసింది. దీంతో జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులంతా ఉద్యోగం లేనందున ప్రభుత్వం స్వయం ఉపాధికి దారి చూపుతుందని ఎంతో ఆశ పడ్డారు. దీంతో నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. అర్హత ఆధారంగా రూ.50 నుంచి రూ.4లక్షల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, ఓబీసీలు కలిపి మొత్తం 32,638 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఎస్సీలు 6,711, ఎస్టీలు 3,461, బీసీలు 19,686, ఈబీసీలు 550, మైనార్టీలు 2,175, క్రిస్టియన్లు 55 దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. వీటిని పూర్తిస్థాయిలో పరిశీలన చేసిన అధికారులు 29,855 దరఖాస్తులను బ్యాంకులకు పంపించారు. సరైన ధ్రువ పత్రాలు లేకపోవడంతో వాటిని తొలగించినట్లు సమాచారం. ముందుగా రూ.50వేల వరకు రుణాలు ఇస్తామని తెలిపి తేదీని ప్రకటించిన ప్రభుత్వం చివరకు వాయిదా వేయడంతో లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటి వరకు రాజీవ్ యువ వికాసం పథకంపై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేక పోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
రూ.50వేల వరకు రుణం తీసుకునే నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆపై రుణాలకు బ్యాంకు లింకేజీల ద్వారా ఇస్తూ యూనిట్ విలువ ఆధారంగా సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రభుత్వం 81 యూనిట్లు పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది.