
పైసలున్నా పనులేవీ..?
● పెచ్చులూడి.. వర్షపునీరు వచ్చి..
● అందులోనే తరగతుల నిర్వహణ
● భయాందోళనలో విద్యార్థులు
నర్సాపూర్: పెచ్చులూడిన గదుల్లోనే ఉపాధ్యాయు లు తరగతులు నిర్వహిస్తున్నారు. ఎప్పడేం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు కావ డంతో పనులు చేపట్టిన కాంట్రాక్టరు కొన్ని పనులు చేపట్టి అర్ధంతరంగా ఏడాది క్రితం నిలిపివేశాడు. సదరు కాంట్రాక్టర్‌పై గిరిజన గురుకుల సంస్థ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్‌లోని అల్లూ రి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాలకు మరమ్మతులు చేపట్టేందుకు గత ఏడాది ప్రభుత్వం రూ. 2కోట్లు మంజూరు చేసింది. అప్పట్లోనే మరమ్మతు పనులను ఓ కాంట్రాక్టరు చేపట్టి కొన్ని పనులు చేశాడు. కాగా గత ఏడాది అక్టోబరులో పనులు ఆపివేశాడు. ఇంత వరకు మిగిలిన పను లను అధికారులు చేయించకపోవడంతో విద్యార్థు లు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.
పాఠశాలలోని పలు తరగతి గదుల పైకప్పుల పెచ్చులు ఇప్పటికే ఊడిపోయి వర్షం వచ్చినప్పుడు నీరు కిందికి కారుతోంది. భయపడుతూ ఆ గదుల్లోనే తరగతులు కొనసాగిస్తున్నారు. గదుల పైకప్పు పాడై వర్షానికి ఎక్కువగా నీరు కారుతున్న కొన్ని గదులకు తాళం వేసి వాడటం లేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా బాలుర టాయిలెట్స్‌కు మరమ్మతులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దీంతో విద్యార్థులు అత్యవసరమైనప్పుడు బయటకు వెళుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా పాఠశాల భవనంతో పాటు హాస్టల్ భవనం కిటికీలకు తలుపులు బిగించకపోవడంతో రాత్రి ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. భవనాల గోడలు పాకురు పట్టి చాలా అధ్వాన్నంగా కనిపిస్తున్నాయి. అలాగే మీటింగ్ హాలుకు మరమ్మతులు చేసేందుకు కిటికీలు తొలగించి వదిలేశారు. ఏదైనా సమావేశం ఏర్పాటు చేయాల్సి వస్తే ఏడాది నుంచి చిన్న గదుల్లోనే నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ఉన్నతాధికారులకు చెప్పాం..
పాఠశాలలో నెలకొన్న సమస్యలు, మరమ్మతులు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మరమ్మతులు చేయకపోవడంతో ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించాం. – కృష్ణ కిశోర్, ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్

పైసలున్నా పనులేవీ..?

పైసలున్నా పనులేవీ..?