
ధాన్యం సేకరణకు పక్కా ప్రణాళిక
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: ఈ ఏడాది ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ మొదటి వారం నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కొనుగోలులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్‌కు రూ. 2,389, సాధారణ రకానికి రూ.2,369 చొప్పున కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం ఖరీఫ్‌లో 4.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందని చెప్పారు. ధాన్యం తరలించే వాహనాలన్నింటికీ జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. త్వరితగతిన సీఎంఆర్ బియ్యం రికవరీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఏఓ దేవ్‌కుమార్, లీగల్ మెట్రాలజీ అధికారి, సుధాకర్, రవాణాశాఖ అధికారి వెంకన్న కో–ఆపరేటివ్ అధికారి కరుణాకర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీష్, అదనపు డీఆర్డీఓ సరస్వతి, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.