
సర్కారు వైద్యం.. దైవాదీనం!
● నిండుకున్న మందుల నిల్వలు
● మూడేళ్లుగా బిల్లుల పెండింగ్
● వేధిస్తున్న సిబ్బంది కొరత
● పేదలకు అరకొరగా వైద్యసేవలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లక్ష్మి. చిన్నశంకరంపేట మండలం జంగారాయి. ఈనెల 20న గేదె పొడవటంతో తలకు తీవ్ర గాయం అయింది. అదే రోజు సాయంత్రం జిల్లా కేంద్ర ఆస్పత్రికి వెళ్లగా, పరీక్షించిన వైద్యులు సిటీస్కాన్ తీయాలని, టెక్నీషియన్ అందుబాటులో లేడని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. అలాగే ఆస్పత్రిలో మందులు లేవని, బయటి నుంచి తెచ్చుకోవాలని చీటీరాసి ఇచ్చారు. దీంతో చేసేది లేక ఆమె కుటుంబీకులు బయట కొనుగోలు చేసి తీసుకొచ్చారు. సిటీస్కాన్ కోసం రెండు రోజులు ఎదురుచూసిన బాధితురాలు చేసేది లేక ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది.
మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలో గత నాలుగు దశాబ్దాల క్రితం ఏరియా ఆస్పత్రిని నిర్మించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దానిని జిల్లా ఆస్పత్రిగా మార్చారు. కాగా మెడికల్ కళాశాల మంజూరు కావటంతో ఇక్కడ అన్ని రకాల వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశపడిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఆరోగ్యశ్రీలో భాగంగా రావాల్సిన నిధులు సుమారు రూ. 1.50 కోట్లు నిలి చిపోయాయి. ఇవి సకాలంలో వస్తే ఆస్పత్రి నిర్వహణ, మందుల కొనుగోలుతో పాటు వైద్యు లు, సిబ్బందికి రావాల్సిన వాటా సైతం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మూడేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు నిలిచిపోవటంతో ప్రస్తుతం ఆస్పత్రిలో మందుల కొరత వేధిస్తోంది. అంతేకాకుండా రూ. 14 లక్షల విలువ చేసే అత్యవసర మందులు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అరువుగా తెచ్చినట్లు సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు.
సిటీస్కాన్ ఉన్నా టెక్నీషియన్ లేడు!
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 15 రోజుల క్రితం సిటీస్కాన్ ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా తలకు గాయం అయినప్పుడు తీవ్రతను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. దీనిని ప్రైవేట్‌లో తీయాలంటే ఒక్కో పేషెంట్‌కు రూ. 2,500 వరకు అవుతుంది. ఆస్పత్రిలో ఏర్పాటు చేయటంతో సంతోషించా రు. కానీ టెక్నీషియన్ ఒక్కరే ఉండటంతో అతను విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే దానిని ఉపయోగిస్తున్నారు. సాయంత్రం 5 గంటలు అయిందంటే గదికి తాళం వేస్తున్నారు. దీంతో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది.
నిధుల కొరత ఉంది
ఆస్పత్రికి రావాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు గత మూడేళ్లుగా నిలిచిపోయాయి. దీంతో అత్యవసర మందులను బయట అరువుకు తేవాల్సి వస్తోంది. సిటీస్కాన్ టెక్నీషియన్లు నలుగురు ఉండాల్సి ఉండగా, ఒక్కరే ఉన్నారు. త్వరలో మరో ముగ్గురిని నియమిస్తాం. కొన్ని పరికరాలు లేనందున వైద్యానికి కొంత ఆటంకం కలుగుతోంది. – సునీత,
జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్