
తెగులు.. దిగులు
●వర్షాలతో పంటలపై తీవ్ర ప్రభావం ●దిగుబడిపై ఆందోళన చెందుతున్న రైతన్నలు
కొల్చారం(నర్సాపూర్): అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. దీంతో చేతికొచ్చే దశలో పంటలు దెబ్బతింటున్నాయి. నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తి ప్రస్తుతం పూత, పిందె దశలో.. వరి పొట్ట దశలో ఉంది. ఈ సమయంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో తెగుళ్లు సోకుతున్నాయి. ముందస్తుగా నాట్లు వేసిన వరి పొలాలు గింజ తొడుగుతున్న దశలో కంకులు నల్లగా మారి తాలు కనిపిస్తుందని రైతులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వ్యవసాయ అధికారులు వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు సూచనలు చేస్తున్నప్పటికీ, ఎడతెరిపి లేని వర్షం సత్ఫలితాలు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఈసారి దిగుబడి తగ్గడమే కాకుండా కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.