
నేతల జాతకాలు తారుమారు
జెడ్పీ చైర్మన్ అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)
ఎంపీపీ పదవిపై ఆశలు..
ఎంపీటీసీ రిజర్వేషన్ అడియాశలు
బీసీ రిజర్వేషన్లతో ఆశ లు ఆవిరి
మెదక్‌అర్బన్: ‘దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లుంది’ రాజకీయ నాయకుల పరిస్థితి. మెదక్ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులకు వారి సొంత ప్రాదేశిక స్థానాల్లో రిజర్వేషన్లు అనుకూలించలేదని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల నేపథ్యంలో నేతల జాతకాలు తారుమారయ్యాయి. అనాదిగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారు, పదవులపై ఆశలు పెంచుకొని పార్టీలో చేరిన వారికి రిజర్వేషన్లు ప్రతికూలంగా వచ్చాయి. కాగా ఖచ్చితంగా పార్టీ ఎవరినైనా చైర్మన్ అభ్యర్థిగా భావిస్తే, అతడు తనకు అనుకూలమైన మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
జెడ్పీ చైర్మన్ పదవి అందని ద్రాక్షేనా!
నర్సాపూర్ నియోజకవర్గంలోని ఓసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే అప్పట్లో సదరు నాయకునికి వచ్చే ఎన్నికల్లో జెడ్పీ చెర్మన్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. కాగా ప్రస్తుతం ప్రకటించిన రిజర్వేషన్లలో ఆయన సొంత జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం బీసీ జనరల్‌కు కేటాయించారు. అలాగే అదే నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓసీ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఆయన పేరు కూడా జెడ్పీ చైర్మన్ పదవి రేసులో వినిపిస్తుంది. కాగా ఆయన సొంత జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు అలాట్ అయ్యింది. మనోహరాబాద్ మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని ఆశించి సఫలీకృతం కాలేకపోయారు. ప్రస్తుతం ఓసీ వర్గానికి చెందిన ఆయన పేరు కూడా చైర్మన్ రేసులో వినిపిస్తుంది. కాగా ఆయన సొంత ప్రాదేశిక నియోజకవర్గం ఓసీ మహిళకు అలాట్ అయ్యింది. పాపన్నపేట మండలంలోని ఓసీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు కరడు గట్టిన కాంగ్రెస్ వాది. ఆయన కూడ జెడ్పీ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ పాపన్నపేట జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించారు. శంకరంపేట(ఆర్)కు చెందిన ఓసీ నాయకుడు కూడా చైర్మన్ పదవిపై ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ స్థానం బీసీ జనరల్‌కు అలాట్ అయ్యింది.
అంచనాలు తలకిందులు
కేవలం జెడ్సీటీసీ చైర్మన్ పదవే కాకుండా, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులకు సొంత ప్రాదేశిక నియోజకవర్గాల్లో ప్రతికూల రిజర్వేషన్లు వచ్చాయి. అర్కెల గ్రామ పంచాయతీలోని 9, 10 వార్డులు ఎస్టీ వర్గానికి కేటాయించారు. కాగా అక్కడ ఒక్క ఎస్టీ కుటుంబం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.