
ఉత్కంఠకు తెర
బీసీలకు పెరిగిన ప్రాధాన్యం
21 జెడ్పీటీసీ స్థానాల్లో
9 కేటాయింపు
గతంతో పోలిస్తే 2 స్థానాలు పెరుగుదల
జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు ఖరారు
మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీఓ విడుదల అయిన నేపథ్యంలో శనివారం మండల పరిషత్, జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్‌రాజ్ జాబితాను విడుదల చేశారు. జిల్లాలో 21 మండలాలు ఉండగా, 21 ఎంపీపీలు, 21 జెడ్పీటీసీలకు రిజర్వేషన్ పక్రియను పూర్తిచేశారు. బీసీలకు గతంతో పోలిస్తే ఈసారి 2 జెడ్పీటీసీ స్థానాలు, 2 ఎంపీపీ స్థానాలు పెరిగాయి. 2019– 2024 జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో జిల్లాలో 20 మండలాలు మాత్రమే ఉండగా, పరిపాలన సౌలభ్య కోసం గతేడాది నూతనంగా మాసా యిపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మండలాల సంఖ్య 21కి చేరింది. కాగా గతంలో జరిగిన ఎన్నికల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్‌లో భాగంగా 7 జెడ్పీటీసీ, 7 ఎంపీపీ స్థానాలను కేటాయించారు. ప్రస్తుతం 42 శాతం అమలు కావటంతో 21 మండలాలకు 9 జెడ్పీటీసీ, 9 ఎంపీపీ స్థానాలను బీసీలకు రిజర్వుడ్ చేస్తూ జాబితాను విడుదల చేశారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు అయ్యాక మెదటగా జిల్లా పరిషత్ పీఠాన్ని బీసీ మహిళకు ఎన్నికల కమిషన్ రిజర్వుడ్ చేసింది. ఈసారి అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)కు కేటాయించారు. ఓసీ జనరల్ కు కేటాయించే అవకాశాలు ఉన్నాయంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది.
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా