7:11 PM Movie Review And Rating In Telugu, The Story Of This Movie Takes Place In 1999 - Sakshi
Sakshi News home page

7:11 PM Telugu Movie Review: టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన 7:11 పీఎమ్‌ మూవీ ఎలా ఉందంటే..

Published Fri, Jul 7 2023 7:48 AM | Last Updated on Fri, Jul 7 2023 9:50 AM

7:11 PM Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: 7:11 పీఎమ్‌
నటీనటులు: సాహస్, దీపిక, టెస్, రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు
నిర్మాతలు: నరేన్ యనమదల, మాధురి రావిపాటి & వాణి కన్నెగంటి
దర్శకత్వం: చైతు మాదాల
సంగీతం : గ్యాని
సినిమాటోగ్రఫీ: వ శంకర్, ఫాబియో కాపోడివెంటో
ఎడిటర్: శ్రీను తోట
విడుదల తేది: జులై 7,2023

7:11 PM 2023 Telugu Movie Review

కథేంటంటే..
ఈ సినిమా కథ 1999లో జరుగుతుంది. కృష్ణా జిల్లా హంసలదీవి గ్రామానికి చెందిన రవి(సాహాస్‌ పగడాల) డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతుంటాడు. ఖాళీ సమయంలో తన బాబాయ్‌ మిలిటరీ ప్రభాకర్‌తో కలిసి ‘సైనిక్‌ గ్యారేజ్‌’లో పని చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే కృష్ణ(భరత్‌ రెడ్డి) చెల్లి విమల(దీపికా రెడ్డి), రవి ప్రేమలో ఉంటారు. ఇది కృష్ణకు నచ్చదు. చెల్లికి వార్నింగ్‌ ఇచ్చి, వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు సిద్ధమవుతుంటాడు.

ఇదిలా ఉంటే స్థానిక మంత్రి బసవ పున్నయ్య అండతో రాజేష్‌ అనే వ్యక్తి ‘అపరిమితం మ్యూచువల్‌ ఫండ్స్‌’ కంపెనీ పేరుతో ఊర్లోవాళ్ల డబ్బునంతా దోచుకొని బోర్డు తిప్పేందుకు రెడీ అవుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న రవి గ్యాంగ్‌.. ఎలాగైనా రాజేష్‌, మంత్రి మోసాన్ని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటారు. ఈ క్రమంలో రవి అనుకోకుండా బస్సు రూపంలో ఉన్న ఓ టైమ్‌ మిషన్‌ ఎక్కుతాడు. మరుసటి రోజు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ బీచ్‌లో రవి నిద్రలేస్తాడు. అంతేకాదు తాను 1999వ సంవత్సరం నుంచి 2024 కాలంలోకి వెళ్తాడు. అసలు ఆ టైమ్‌ మిషన్‌ ఆ ఊరికి ఎలా వచ్చింది? రవి ఎందుకు ఆ బస్సు ఎక్కాల్సి వచ్చింది? రవి తిరిగి తన కాలంలోకి వచ్చాడా? మంత్రి బసవ చేసే కుట్రల గురించి తెలిశాక రవి దానిని ఎలా అడ్డుకున్నాడు? చివరకు తాను ప్రేమించిన అమ్మాయి విమలను కలిశాడా లేదా? అనేదే మిగతా కథ. 

7:11 PM Movie Rating And Photos

ఎలా ఉందంటే..
టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెలుగులో ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. 'ఆదిత్య 369' మొదలు మొన్నటి 'బింబిసార', 'ఒకే ఒక జీవితం' లాంటి చిత్రాలన్ని టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో వచ్చి సూపర్‌ హిట్‌ అనిపించుకున్నాయి. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే 7:11 పీఎమ్‌. ఓ గ్రామాన్ని నాశనం చేసి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనుకున్నరాజకీయ నాయకుల పన్నాగాన్ని ఓ యువకుడు ఎలా అడ్డుకున్నాడు. దానికి టైమ్‌ ట్రావెల్‌ ఎలా ఉపయోగపడిందనేదే ఈ సినిమా స్టోరీ. ఒక గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ టైమ్‌ ట్రావెల్‌ కథకి ఊరి సమస్యను ముడిపెట్టి 7:11 అనే చిత్రాన్ని తీశాడు దర్శకుడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ దానిని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. అసలు కథను ప్రారంభించడానికి చాలా సమయం తీసుకున్నాడు.

వేరే ‍గ్రహానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భూమి మీదకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. ఫస్టాఫ్‌ మొత్తం హంసలదీవి అనే గ్రామం చుట్టే తిరుగుతుంది. గ్రామ ప్రజలను మోసగించి, అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రి ప్లాన్‌ వేయడం..దానిని అడ్డుకునేందుకు హీరో గ్యాంగ్‌ ప్రయత్నించడం.. ఇలా రొటీన్‌గా ఫస్టాఫ్‌ సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో అసలు కథ ప్రారంభం అవుతుంది.

ముందు రోజు ఇండియాలోని ఓ మారుమూల గ్రామంలో బస్‌ ఎక్కిన వ్యక్తి.. తర్వాతి రోజు ఉదయమే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని సముద్ర తీరాన నిద్రలేవడం, పాతికేళ్లు ముందుకు వెళ్లడం. ఈ పాతికేళ్లతో ఊరిలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? వాటిని అడ్డుకునేందుకు హీరో మళ్లీ తన కాలంలోకి వెళ్లడం..ఇలా ప్రతి సీన్‌ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే చాలా చోట్ల దర్శకుడు సినిమాటిక్‌ లిబర్టీని తీసుకున్నాడు. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని, తెలిసిన నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో మన నేటివిటితో తెరకెక్కించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ..ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్లి చూస్తే అలరిస్తుంది.

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాలో చాలా వరకు కొత్త నటీనటులే ఉన్నారు. హీరో హీరోయిన్లుగా నటించిన సాహన్‌, దీపిక తమ పాత్రలకు న్యాయం చేశారు. కొత్తవాళ్లు అయినా చక్కగా నటించారు. విలన్‌ పాత్ర పోషించిన వ్యక్తి కూడా తనదైన నటనతో భయపెట్టాడు. రఘు కారుమంచి, డా. భరత్ రెడ్డి, రైజింగ్ రాజు తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాటలు ఒక్కటి కూడా లేదు. సినిమాటోగ్రఫీ జస్ట్‌ ఓకే. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement