
‘కేజీఎఫ్ 2’ టీమ్‌కు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు ఆ మూవీ హీరో యశ్‌తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరంగదుర్‌లకు క్షమాపణ లేఖలు రాస్తూ.. ‘కేజీఎఫ్ 2’చిత్రానికి తాను కూడా ప్రచారం చేస్తానని చెప్పారట. అదేంటి ఆమిర్ ఎందుకు సారీ చెప్పారు? ‘కేజీఎఫ్ 2’ఆయన ఎందుకు ప్రచారం చేస్తారు? అనే కదా మీ డౌటానుమానం. వివరాల్లోకి వెలితే.. ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’. ఈ మూవీలో కరీనా కపూర్, నాగచైతన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ విడుదల తేదిని కూడా ప్రకటించారు మేకర్స్. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే అదే రోజు(ఏప్రిల్ 14) కేజీఎఫ్ 2 కూడా విడుదల కానుంది. ఈ తేదిని గతంలో కేజీఎఫ్ 2 బృందం ప్రకటించింది. ఈ చిత్రంపై కూడా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఒకే రోజున రెండు పెద్ద సినిమాలు విడుదలైతే బాక్సాఫీస్ వసూళ్లను షేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమిర్ ఖాన్ ‘కేజీఎఫ్ 2’టీమ్‌కు క్షమాపణలు చెప్పారు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘తప్పనిసరి పరిస్థితిలో ఏప్రిల్ 14న లాల్‌సింగ్ చద్దాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కేజీఎఫ్ 2 నిర్మాత విడుదల తేదీని ప్రకటించారని తెలిసి కావాలనే మేము ఆ రోజును ఎంచుకోలేదు. విడుదల తేదీని ప్రకటించే ముందు ‘కేజీఎఫ్2’ నిర్మాత విజయ్ కిరంగదుర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్‌లకు క్షమాపణ చెబుతూ లేఖ రాశా. యశ్‌తో ఫోన్‌లో కూడా మాట్లాడాను. ‘కేజీఎఫ్, లాల్‌సింగ్ చద్దా’ రెండు వేర్వేరు జోనర్‌లకు సంబంధించిన చిత్రాలు. ప్రేక్షకులు రెండు సినిమాలను ఆదరిస్తారు. ‘కేజీఎఫ్ 2’కు నేనే స్వయంగా ప్రచారం చేస్తా. ఆ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ‘కేజీఎఫ్ 2’కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఏప్రిల్ 14న థియేటర్స్‌లో ఆ సినిమా చూస్తా’అని ఆమిర్ తెలిపారు. మరి ఒకే రోజున వస్తున్న ఈ రెండు చిత్రాలలో ప్రేక్షకులు దేనికి బ్రహ్మరథం పడతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment