కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో సర్జరీ కోసం తాజాగా ఆయన అమెరికాకు వెళ్లారు. ఈమేరకు ఏయిర్‌పోర్ట్ వద్ద మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు. 'భైరతి రంగల్' సినిమా విడుదల తర్వాత ఆయన మరో కొత్త సినిమాను ప్రకటించలేదు. ఈ సినిమా సమయం నుంచే ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దీంతో అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో డిసెంబర్ 24న సర్జరీ జరగనుంది. మీడియాతో శివరాజ్ కుమార్ తన అనారోగ్యం గురించి ఇలా చెప్పుకొచ్చారు.
'ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఎందరో అభిమానులు, సహ నటీనటులు నుంచి ఎంతో ప్రేమ నాకు అందుతుంది. వారందరి ఆశీస్సులు నేను పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. నేను కాస్త అనారోగ్యంగా ఉన్నానని గతంలోనే పంచుకున్నాను. అయితే, ఈ విషయంలో మీడియా చాలా సంయమనం పాటించి తప్పుగా వార్తలు ప్రచారం చేయలేదు. వారందరికీ ధన్యవాదాలు. సర్జరీ కోసం ఇలా వెళ్తున్నప్పుడు ఎవరిలోనైనా కాస్త ఆందోళన ఉంటుంది.
చాలా విషయాల్లో నేను చాలా డేర్‌గా ఉంటాను. అయితే, ఇలాంటి సమయంలో అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను చూసినప్పుడు కాస్త ఎక్కువగానే ఎమోషనల్ అవుతాం. అంతా మంచిగానే జరుగుతుంది. ఎవరూ అందోళన చెందకండి. సర్జరీ పూర్తి అయ్యాక యూఐ, మ్యాక్స్ సినిమాలను తప్పకుండా చూస్తాను.' అని ఆయన అన్నారు.
శివరాజ్ కుమార్ ఆరోగ్య సమస్య గురించి మీడియాతో పంచుకోలేదు. తన అనారోగ్యం గురించి చెప్పి అభిమానులను బాధ పెట్టడం ఇష్టం లేదని ఆయన అన్నారు. అయితే, ఫ్లోరిడాలోని మయామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్‌లో ఆయన చేరనున్నారని తెలుస్తోంది. 'భైరతి రంగల్' సినిమా కోసం ఆయన భారీగానే ప్రచారం చేశారు. అయితే, ఒప్పుకొన్న సినిమాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన తన చిత్రం కోసం కష్టపడ్డారు. సర్జరీ తర్వాత సుమారు నెల రోజుల పాటు ఆయన అమెరికాలోనే ఉండనున్నారు. రెండు నెలల తర్వాత మళ్లీ అందరి ముందుకు వస్తానని శివ అన్నారు. ఉత్తరకాండ, భైరవుడు, రామ్‌చరణ్-బుచ్చిబాబుల చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment