అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'డియర్ కృష్ణ'. 'ప్రేమలు' ఫేమ్ మమిత బైజుతో పాటు ఐశ్వర్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్‌ను ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోమవారం నాడు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో శ్రీ కృష్ణుడిని ముఖ్య అతిథిగా భావిస్తూ, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేయడం విశేషం.
రచయిత, నిర్మాత పి.ఎన్. బలరామ్ మాట్లాడుతూ.. "నేను ఈ సినిమాకి నిర్మాతగా భావించట్లేదు. కృష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగానే భావిస్తున్నాను. మా కుటుంబమంతా శ్రీ కృష్ణుడిని ఎంతగానో ఆరాధిస్తాము. ఆయన ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. కృష్ణుడి వల్ల మా కుటుంబంలో జరిగిన మిరాకిల్‌నే కథగా తీసుకొని డియర్ కృష్ణ సినిమా రూపొందించాం. అదేంటంటే మా కుమారుడు అక్షయ్ అత్యంత రేర్ డిసీజ్ నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సినిమాలో అక్షయ్‌నే హీరోగా నటించాడు. ఈ చిత్రం కోసం మేము స్టార్స్‌ను తీసుకోవాలనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్. మమ్మల్ని, మా సినిమాని కృష్ణుడే నడిపిస్తాడు" అన్నారు.
కథానాయకుడు అక్షయ్ మాట్లాడుతూ, "మా నాన్న నాకు జన్మని ఇవ్వడమే కాదు, పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన వల్లే నేనీ రోజు మీ ముందున్నాను. దళపతి విజయ్ గారి 69 వ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల మమిత ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయింది. త్వరలో జరిగే ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఆమె పాల్గొంటుంది" అన్నారు.
గీత రచయిత గిరిపట్ల మాట్లాడుతూ.. " ఈ సినిమాలో మూడు పాటలు రాసే లభించింది. అందులో ఒక పాటను లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడటం అదృష్టంగా భావిస్తున్నాను" అన్నారు. హరి ప్రసాద్ సంగీతం అందించగా, దినేష్ బాబు సినిమాటోగ్రాఫర్‌గా, రాజీవ్ రామచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట ఈ సినిమాలోనిదే కావడం విశేషం. 'చిరుప్రాయం' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే విడుదలై విశేషంగా ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment