సానుభూతితో అయినా గెలుపు దక్కుతుందనుకుంటే.. ఆ నటికి ఘోరమైన ఓటమి ఎదురైంది. గృహ హింస వేధింపుల కేసు ఓడిపోవడంతో పాటు పరువు నష్టం రాబట్టడంలోనూ ఎదురు దెబ్బే తగిలింది. ఒక మగాడు.. అందునా కాస్త పేరున్న హీరో కావడంతో జానీ డెప్ సక్సెస్‌ను ఆయన అభిమానగణం, ప్రత్యేకించి.. పురుష సమాజం భారీగానే సెలబ్రేట్ చేసుకుంది. పుట్టెడు దుఖంలో ఉన్న ఆమెకు ఇప్పుడు ఒక అసాధారణమైన పెళ్లి ప్రపోజల్ వచ్చింది.
జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. మాజీ భార్య అంబర్‌కు డెప్ ఇంకా 2 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి. అదే సమయంలో డెప్‌కు అంబర్ హర్డ్ 13.5 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి. అయితే అంత పరిహారం చెల్లించే పరిస్థితిలో తను లేదంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు ఆమె తరపు న్యాయవాది. ఇదిలా ఉండగా.. సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు అంబర్ హర్డ్‌కు పెళ్లి ప్రపోజల్ పంపాడు. అది మామూలుగా లేదు!
ఆ ముసలోడి(జానీ డెప్‌ను ఉద్దేశించి) కంటే నేనే నయం అంటూ ఓ ఆడియో వాయిస్‌ను అంబర్ హర్డ్‌కు పంపాడు ఆ వ్యక్తి. సౌదీ అరేబియాకు చెందిన సదరు వ్యక్తి ఓ షేక్‌గా తెలుస్తోంది. వాయిస్ నోట్ ద్వారా అంబర్ హర్డ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సందేశం పంపాడు.
అంబర్.. నీ దారులన్నీ మూసుకుపోతున్నాయ్. నేను తప్ప నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్లెవరూ లేరు. కొందరు నిన్ను ద్వేషిస్తూ.. తిడుతున్నారు. అందుకే.. నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నా. ఈ సమాజం నిన్ను అంగీకరించకపోయినా.. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. అల్లా దయ నీ మీద ఉంటుంది. నువ్వు గొప్పదానివి. అయినా జనాలు నిన్ను కావాలనే మెచ్చుకోరు. ఆ ముసలోడి కంటే నేనే నయం. నన్ను పెళ్లి చేస్కో. నాతో సంతోషంగా ఉంటావ్’’ అంటూ వాయిస్ నోట్ పంపాడు ఆ వ్యక్తి. Bee4andafter_kw అనే అకౌంట్ నుంచి ఆ వాయిస్ నోట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
అంబర్ హర్డ్(36), జానీ డెప్ (58) .. 2015లో వివాహం చేసుకున్నారు. కానీ, ఏడాదికే ఈ సెలబ్రిటీ జంట కాపురం రచ్చకెక్కింది. దీంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట. అయితే కొద్దిరోజులకే ఇద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు.. అదీ జుగుప్సాకరంగా చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కారు. వాషింగ్టన్ పోస్ట్‌లో గృహ హింస బాధితురాలిని అంటూ ఆమె రాసిన కథనంపై 50 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ కోర్టుకు ఎక్కాడు జానీ డెప్.
ప్రతిగా 2020 ఆగష్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానని, పైగా జానీ డెప్.. ఆయన లాయర్ నుంచి అసత్య ప్రచారాలు ఎదుర్కొంటున్నాంటూ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది ఆమె. వర్జీనీయా ఫెయిర్‌ఫాక్స్ కోర్టులో ఆరువారాల పాటు సాగిన విచారణ తర్వాత.. కోర్టు తీర్పు ఇచ్చింది. ఇద్దరినీ పరువు నష్టం పొందేందుకు అర్హులే అని పేర్కొన్న కోర్టు.. జానీ డెప్ వైపే తీర్పు ఇవ్వడంతో అప్పటిదాకా అంబర్ హర్డ్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్లంతా హర్షం వ్యక్తం చేయసాగారు.
Comments
Please login to add a commentAdd a comment