నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా | Amitabh Bachchan And Rekha Love Story In Funday | Sakshi
Sakshi News home page

నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా

Published Sun, Nov 22 2020 11:17 AM | Last Updated on Sun, Nov 22 2020 11:17 AM

Amitabh Bachchan And Rekha Love Story In Funday - Sakshi

‘సలామే ఇష్క్‌ మేరీ జా.. జరా కుబూల్‌ కర్‌లో..  తుమ్‌ హమ్‌సే ప్యార్‌ కర్నేకీ జరా సీ  భూల్‌ కర్‌లో..  మెరా దిల్‌ బేచైన్‌ హై.. హమ్‌సఫర్‌ కె లియే..’ (నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా.. నాతో ప్రేమలో పడే పొరపాటు చెయ్‌... తోడు కోసం నా మనసు తపిస్తోంది) అంటూ ఆలపిస్తుంది జోరాబాయి సికందర్‌ను ఉద్దేశించి.. ‘ముకద్దర్‌ కా సికందర్‌’లో. ఆ పాట, సినిమా పేరు చెప్పగానే జోరాబాయి, సికందర్‌లు ఎవరో తెలిసిపోయే ఉంటుంది.  అవును.. రేఖ, అమితాబ్‌ బచ్చన్‌. వాళ్ల అధూరీ ప్రేమ్‌ కహానీ (అసంపూర్ణ ప్రేమ కథ)యే ఈ వారం ‘మొహబ్బతే’.

సాధారణంగా సినిమా జంటల ప్రేమకథలన్నీ వాళ్లు నటించిన సినిమా సెట్స్‌ మీదే మొదలవుతాయి. దీనికి రేఖ, అమితాబ్‌లూ మినహాయింపు కాదు. ‘దో అన్‌జానే’ (1976) ఈ ఇద్దరికీ తొలి సినిమా. అప్పుడే ఒకరితో ఒకరికి పరిచయం కూడా. ఆ నాటికే రేఖ సీనియర్‌ అమితాబ్‌ కంటే. అప్పటిదాకా అమితాబ్‌ బచ్చన్‌ ఆమెకు దీదీబాయి (జయా బచ్చన్‌) భర్తగానే తెలుసు.

‘దో అన్‌జానే’ సెట్స్‌ మీదే అమితాబ్‌ బచ్చన్‌గా పరిచయం అయ్యాడు. అతను ఆమెనెంత ఆకర్షించాడో ఆమే అతణ్ణంతే సమ్మోహనపరచింది. ఆ సినిమా పూర్తయ్యేసరికి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ వ్యవహారాన్ని మూడో కంటపడనివ్వకుండా  చాలా జాగ్రత్తగా ఉందీ జంట. రేఖ స్నేహితురాలి బంగ్లాలో కలుసుకునేవాళ్లు. అలా దాదాపు రెండేళ్లు గుట్టుగానే సాగింది ఆ లవ్‌ స్టోరీ. 

చెడమడా తిట్టేశాడు.. 
1978లో ‘గంగా కీ సౌగంద్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఇందులోనూ రేఖ, అమితాబ్‌లే హీరోహీరోయిన్లు. ఒక సహనటుడు రేఖ పట్ల అనుచితంగా ప్రవర్తించనారంభించాడు. రేఖ వారించింది. అయినా వినిపించుకోలేదు అతను. పైగా రేఖ నిస్సహాయతను అలుసుగా తీసుకోసాగాడు. ఇదంతా గమనిస్తున్న అమితాబ్‌ ఇక ఊరికే ఉండలేకపోయాడు. ఆవేశంగా ఆ నటుడి దగ్గరకు వెళ్లి చెడమడా తిట్టేశాడు. అమితాబ్‌ రియాక్షన్‌కి అక్కడున్న క్రూలోని అందరి కనుబొమలూ పైకి ఎగసాయి.

‘రేఖ మీద సర్‌కున్న ప్రత్యేక అభిమానం’ గురించి ఆరా తీశారు. ప్యార్‌ కే సివా కుఛ్‌ నహీ హై అని తేల్చేశారు. ఆ వివరం నెమ్మదిగానే అయినా షికారు మొదలుపెట్టింది.  మీడియాకూ చేరి.. ఆ ఇద్దరినీ ప్రశ్నించింది. ‘అలాంటిదేమీ లేదు’ అంటూ కొట్టిపారేశారిద్దరూ. కాని ఆ పుకారు ఆగలేదు. ఎంతదాకా వెళ్లిందంటే అమితాబ్‌ బచ్చన్, రేఖ రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారు అనేదాకా. 

పాపిట్లో కుంకుమ.. 
ఆ రూమర్‌ నిజమే అన్న అనుమానాన్ని కలిగించింది రేఖ.. నితూ, రిషి కపూర్‌ పెళ్లిలో. పాపిట్లో కుంకుమ దిద్దుకుని, మెడలో మంగళ సూత్రం వేసుకొని ఆ శుభకార్యానికి హాజరై. అలా ఆమెను చూసి పందిట్లోనే చెవులు కొరుక్కోసాగారంతా. అదేమీ పట్టించుకోని రేఖ.. సతీసమేతంగా (జయా భాదురి) విచ్చేసిన అమితాబ్‌ బచ్చన్‌ దగ్గరకు వెళ్లి అతని పక్కన నిలబడి మాట్లాడసాగింది. ఈసారి విస్తుపోవడం జయా భాదురి వంతైంది. ఆ సమయంలో అతిథుల దృష్టి రేఖ మీద కంటే జయా మీదే ఉండింది.. ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలని. వాళ్లు నిరాశ పడక తప్పలేదు. జయా మౌనంగానే అమితాబ్‌ వెంట నడిచింది. 

సిల్‌సిలా..
ఈ విషయమూ మీడియా చెవిన పడింది.  రేఖను అడిగితే.. ‘నాకు అలా పాపిట్లో కుంకుమ పెట్టుకోవడం ఇష్టం. అందుకే పెట్టుకున్నాను’ అని జవాబిచ్చింది. అమితాబ్‌నూ వదిలిపెట్టలేదు ప్రెస్‌. అయితే  ఆయన  ఎక్కడా.. ఎప్పుడూ అది అబద్ధమని కాని, నిజమని కాని నోరు విప్పి చేప్పలేదు. ఆ మాటకొస్తే రేఖ అంటే ఇష్టమనీ ఇప్పటికీ ఒప్పుకోలేదు. మాట్లాడకపోవడమే సమాధానంగా ఎంచుకున్నాడు బిగ్‌బీ. ఆ సంఘటన తర్వాత ‘సిల్‌సిలా’ స్క్రిప్ట్‌ పట్టుకొని ఇటు రేఖను, అటు అమితాబ్‌ దంపతులనూ కలిశాడు దర్శకుడు యశ్‌ చోప్రా. ఆశ్చర్యంగా ఆ సినిమాకు  ముగ్గురూ ఒప్పుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది? అని భృకుటి ముడి వేయొద్దు.

ఒక రకంగా అది ఆ ముగ్గురి జీవితమే.. కథగా తెర మీద ఆడింది. ‘సిల్‌సిలా’ టైమ్‌లో హ్యాంగర్‌కు వేళ్లాడుతున్నట్టుండేది నా పరిస్థితి. రియల్‌ లైఫ్‌లోలాగే ఆ సినిమాలోనూ జయ.. అమితాబ్‌ భార్య, రేఖ అతని ప్రియురాలు.నిజజీవితంలోని కోపతాపాలను నటించేప్పుడు ఎక్కడ బయటపెడతారో అని హడలి పోయేవాడిని’ అని చెప్పాడు యశ్‌చోప్రా ఒక ఇంటర్వ్యూలో. అంతేకాదు రేఖ, అమితాబ్‌ల మధ్య ప్రేమ నిజమని బయటపెట్టిందీ చోప్రానే. అయితే.. యశ్‌ చోప్రా భయపడ్డట్టుగా ‘సిల్‌సిలా’ సినిమా షూటింగ్‌ సమయంలో ఆ ముగ్గురూ ఎలాంటి ఆవేశకావేశాలకు లోనుకాలేదు కాని.. సిల్‌సిలా విడుదల తర్వాత మాత్రం రేఖ, అమితాబ్‌ల ప్రేమ కృష్ణపక్షంలోని చంద్రుడిలా తగ్గుతూ వచ్చింది. 
-ఎస్సార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement