
గుజరాతీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమితాబ్ బచ్చన్. 2022లో అమితాబ్ ఓ కీలక పాత్రలో నటించిన ‘ఫక్త్ మహిళా మాటే’ చిత్రానికి సీక్వెల్ ఇది. యశ్ సోనీ, దీక్షా జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఫక్త్ మహిళా మాటే’కు మంచి ప్రేక్షకాదరణ దక్కింది. జై బోదాస్ దర్శకత్వంలో ఆనంద్ పండిట్, వైశాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఫక్త్ పురుషో మాటే’ అనే సినిమాను ఆరంభించారు. అమితాబ్, యశ్ సోనీ, మిత్ర గాధ్వీ, ఇషా కన్సారా, దర్శన్ జరీవాలా సీక్వెల్‌లో ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌ని పార్థ్ త్రివేదీతో కలిసి జై బోదాస్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
ప్రస్తుతం అమితాబ్‌తో పాటు ఈ చిత్రం ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ‘‘అమితాబ్ బచ్చన్‌గారితో ఓసారి పని చేసిన ఎవరైనా ఆయనతో మళ్లీ వర్క్ చేయాలనుకుంటారు. అమితాబ్‌గారి ఎనర్జీ, అంకితభావం సెట్స్‌లో ఉత్సాహాన్ని మరింత పెంచుతోంది’’ అని పేర్కొన్నారు నిర్మాత ఆనంద్ పండిట్. ఈ సంగతి ఇలా ఉంచితే... మహిళల మనసుల్లో ఏముందో తెలుసుకోగల శక్తులు ఓ కుర్రాడికి వస్తాయి. వాటితో ఆ యువకుడు ఏం చేశాడు? విడిపోతున్న ప్రేమికులను ఎలా కలిపాడు? అనే అంశాలతో ‘ఫక్త్ మహిళా మాటే’ చిత్రం సాగుతుంది. ఇక సీక్వెల్ మగవారి కోణంలో ఉంటుందని టైటిల్ స్పష్టం చేస్తోంది.