2 సెకన్ల చీప్‌ పబ్లిసిటీ కోసమే; అవునా! | Ankita Lokhande Counter To Shibani Dandekar 2 Seconds Of Fame Jibe | Sakshi
Sakshi News home page

నటికి అంకితా లోఖండే గట్టి కౌంటర్‌

Published Fri, Sep 11 2020 11:33 AM | Last Updated on Fri, Sep 11 2020 12:03 PM

Ankita Lokhande Counter To Shibani Dandekar 2 Seconds Of Fame Jibe - Sakshi

ముంబై: రెండు సెకన్ల చీప్‌ పబ్లిసిటీ కోసమే అంటూ తనపై విమర్శలు గుప్పించిన శిబానీ దండేకర్‌కు నటి అంకితా లోఖండే గట్టి కౌంటర్‌ ఇచ్చారు. చనిపోయిన తన స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేస్తేనే తనకు ప్రచారం లభిస్తుందని అనుకోవడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 17 ఏళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని, టీవీ యాక్టర్‌ను అయినందుకే చిన్నచూపు చూస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. కాగా బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో కీలక విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. (చదవండి: నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత)

ఈ నేపథ్యంలో అతడి గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో సుశాంత్‌ మాజీ ప్రేయసి అంకిత లోఖండే.. నటుడి కుటుంబానికి మద్దతుగా నిలుస్తూ రియా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సుశాంత్‌ మృతి కేసులో రియాకు మద్దతుగా స్వరా భాస్కర్‌, రాధికా మదన్, మంచు లక్ష్మి తదితర నటీమణులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నటి శిబానీ దండేకర్‌ రియాను విడుదల చేయాలంటూ ఆమెకు న్యాయం చేకూరాలి అంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అంకితపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంకిత పితృస్వామ్య భావజాలానికి రాకుమారి వంటిదని, 2 సెకన్ల ప్రచారం కోసం ఇలా చేస్తోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ‘బ్రేకప్‌ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’)

ఇక ఇందుకు అంకిత సైతం ఘాటుగానే బదులిచ్చారు. ‘‘ రెండు సెకన్ల ఫేం- ఈ పదం నన్ను ఆలోచింపజేసింది. సాధారణ పట్టణంలోని మర్యాదగల కుటుంబం నుంచి వచ్చాను. నన్ను నేను ప్రమోట్‌ చేసుకునే ఫ్యాన్సీ ఎడ్యుకేషన్‌ నాకు లేదు. 2004లో టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అయితే పవిత్ర రిష్తా సీరియల్‌తో 2009లోనే నా అసలైన ప్రయాణం మొదలైంది. 2014 వరకు ఆ సీరియల్‌ కొనసాగింది. వరుసగా ఆరేళ్లపాటు అత్యధిక టీఆర్సీతో కొనసాగిన విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించక తప్పడం లేదు. 

నిజం చెప్పాలంటే ఫేం అనేది ప్రేక్షకుల నుంచి లభించే ప్రేమ, అభిమానానికి అదనపు హంగు‌ మాత్రమే అనుకుంటున్నా. ప్రేక్షకుల్లో నాకున్న గుర్తింపు కారణంగానే మణికర్ణిక, భాగీ వంటి భారీ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 17 ఏళ్లుగా టీవీ పరిశ్రమలో ఉన్న నేను నా స్నేహితుడికి న్యాయం జరగాలని డిమాండ్‌ చేయడం కేవలం 2 సెకన్ల చీప్‌ పబ్లిసిటీ కోసమే అనడం ఎందుకో నాకైతే అర్థం కావడంలేదు’’ అంటూ టీవీ నటిని అయినందుకు గర్విస్తున్నా నని శిబానీకి ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. కాగా పవిత్ర రిష్తా సీరియల్లో సుశాంత్‌కు జంటగా కనిపించిన అంకిత ఆరేళ్లపాటు అతడితో బంధాన్ని కొనసాగించింది. అయితే సినిమాల్లోకి ప్రవేశించిన తర్వాత సుశాంత్‌ ఆమెకు దూరం కావడంతో ఇద్దరూ స్నేహపూర్వకంగానే విడిపోయారు. ఇక సింగర్‌గా గుర్తింపు పొందిన శిబానీ ప్రస్తుతం ఫర్హాన్‌ అక్తర్‌తో ప్రేమలో ఉన్నారు. అతడి కూతుళ్లతోనూ ఆప్యాయంగా మెలుగుతూ ఉంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement