‘‘తెలుగువాళ్లకు సినిమానే పండగ. సంక్రాంతికి తప్పకుండా సినిమాలు చూసి, పండగ జరుపుకుంటారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.. ఇండస్ట్రీ బాగుండాలి. హిందీ తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాలు, ఎక్కువ సినిమాలు, ఎక్కువ వసూళ్లు, ఎక్కువ వ్యాపారం జరిగేది టాలీవుడ్‌లోనే.. హ్యాట్సాఫ్ టు తెలుగు సినిమా’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, నభా నటేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘అల్లుడు అదుర్స్’. రమేష్ కుమార్ గంజి సమర్పణలో గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు.
∙‘రాక్షసుడు’ వంటి హిట్ సినిమా తర్వాత మూడు నెలలు విరామం తీసుకున్నాను. మంచి కథ, కొత్తదనం ఉండాలి.. నన్ను నేను నిరూపించుకునేలా ఉండాలి. ఆ సమయంలో సంతోష్ శ్రీనివాస్ అన్న చెప్పిన పాయింట్ ఎగ్జయిటింగ్‌గా అనిపించి వెంటనే ఓకే చెప్పేశా. సెకండాఫ్ బాగా నచ్చింది. నా సినిమా ఫ్లాప్ అయితే వెంటనే మరో సినిమా చేస్తా.. హిట్ అయితే కొంచెం వెయిట్ చేసి, మళ్లీ మంచి కథతో మరో హిట్ సినిమా చేయాలనుకుంటాను. చదవండి: ‘ఒక్కసారి నాది అనుకుంటే ప్రాణం ఇచ్చేస్తా’
∙‘అల్లుడు అదుర్స్’ కామెడీ థ్రిల్లర్.. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. 2018 నుంచి నేను కమర్షియల్ సినిమా చేయలేదు.. బాగా ఆకలి మీద ఉన్నాను. ఆ లోటుని ‘అల్లుడు అదుర్స్’ తీర్చింది. ఈ సినిమా కోసం కశ్మీర్‌లో మూడు రోజులు విపరీతమైన మంచులో ఓ పాట చిత్రీకరించాం.. చాలా కష్టంగా అనిపించింది. అక్కడ షూటింగ్‌కి వెళ్లినప్పుడు ఆర్మీ వాళ్లు నన్ను గుర్తు పట్టి మాట్లాడటం చూస్తే నా కష్టాన్ని గుర్తించారనే సంతృప్తి కలిగింది. ఈ లాక్‌డౌన్‌లో నేను బాగా మిస్ అయింది పనిని మాత్రమే. ఇంట్లో రెండు నెలల పాటు అమ్మ, తమ్ముడి చేతి వంట తింటూ బాగా ఎంజాయ్ చేశాను.
► దేవుడి ఆశీర్వాదాల వల్లే బాలీవుడ్‌కి వెళుతున్నాను. బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాలకు అడిగారు కానీ ‘ఛత్రపతి’ రీమేక్ అనడంతో రాజమౌళిగారి సినిమా అని వెంటనే ఓకే చెప్పేశా. ఈ సినిమాని ►బాహుబలి, కేజీఎఫ్’ చిత్రాల రేంజ్‌లో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నాం. తెలుగు ‘ఛత్రపతి’లో ప్రభాస్‌గారు చేసిన పాత్రని చాలెంజింగ్‌గా తీసుకుని నా స్థాయిలో వంద శాతం కష్టపడతా.. నాకు చాలెంజ్‌లు అంటే ఇష్టం. నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు.. హైదరాబాద్ హిందీ మాట్లాడతాను. అయితే ఈ సినిమా కోసం ముంబయ్‌లో ట్యూటర్‌ని పెట్టుకుని పక్కా హిందీ నేర్చుకుంటున్నాను.. అన్నీ కుదిరితే హిందీలోనూ డబ్బింగ్ చెబుతా. ‘ఛత్రపతి’ రీమేక్ మినహా ఏ కొత్త సినిమాని ప్రస్తుతానికి అంగీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment