కంటెస్టెంట్ల ఎంపికతో సహా వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ప్రవేశపెట్టడం వరకు బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ఓరకమైన గందరగోళం కనిపించింది. ఈ సీజన్‌లో మొదటి వారం నుంచే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల వరద ప్రారంభమైన విషయం తెలిసిందే. అందులో స్వాతి దీక్షిత్, కుమార్ సాయి గోడకు కొట్టిన బంతిలా తొందరగానే ఎలిమినేట్ అవగా అవినాష్ తనదైన కామెడీతో ఇంట్లోనే నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్ షో ప్రారంభమై 50 రోజులు దాటిపోయింది. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యాంకర్, సింగర్ మంగ్లీ వైల్డ్ కార్డ్ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సింగర్ నోయల్ సైడ్ అవడంతో ఈ మహిళా సింగర్‌ను లోపలకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. (చదవండి: తన గొయ్యి తానే తవ్వుకుంటున్న మాస్టర్)
అయితే నాగార్జునే స్వయంగా ఆమెను కంటెస్టెంట్లకు పరిచయం చేయనున్నాడా? లేదా నామినేషన్ సమయంలో ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయనుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నరు. నిజానికి మంగ్లీ పేరును బిగ్‌బాస్ షో ప్రారంభంలోనే పరిశీలించారు. కానీ చివరి నిమిషంలో ఆమెను ఎంపిక చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కాగా నోయల్ తాత్కాలికంగానే హౌస్ నుంచి వెళ్లిపోయాడు. కానీ తన ఆరోగ్యం కుదుటపడాలంటే బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో మాటకారి మంగ్లీని రంగంలోకి దింపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. (చదవండి: షాకింగ్: హౌస్ నుంచి వెళ్లిపోయిన నోయల్!)
మరి మంగ్లీ తన యాస, పాటలతో అందరినీ ఆకట్టుకుందా? అప్పటికే బంధాలతో పెనవేసుకుపోయిన కంటెస్టెంట్లతో కలిసిపోతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎనిమిది వారాలు గడిచాక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టడమేంటని కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మొదటి మూడు, నాలుగు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోనికి వెళ్లేందుకు మంగ్లీ అభ్యంతరం చెప్తుందో లేదో కానీ మరీ షో సగం పూర్తయ్యాక వెళ్తుందంటే అనుమానంగానే ఉంది. కాబట్టి మంగ్లీ ఎంట్రీ దాదాపు ఉండకపోవచ్చని కొందరు, ఒకవేళ ఉంటే మాత్రం అది సాహసమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment