
పండగ వచ్చిందంటే చాలు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఈవెంట్స్ అంటూ నానా రచ్చ చేస్తుంటారు సెలబ్రిటీలు. కానీ ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయం లేని సెలబ్రిటీలందరినీ తీసుకువచ్చి బిగ్‌బాస్ హౌస్‌లో వేశారు. 19 మంది కంటెస్టెంట్లతో కళకళలాడిపోతున్న బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో నేడు(శుక్రవారం) వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి. అయితే అయినవాళ్లు పక్కన లేకపోవడంతో కొందరు కంటెస్టెంట్లు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ వెంటనే వారి బాధను దిగమింగుకుని టాస్కులతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం.. బిగ్‌బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో శ్రీరామచంద్ర.. విశ్వ పాల్గొన్నారు. వీరిని మిగతా హౌస్‌మేట్స్ ఎంకరేజ్ చేశారు. కానీ జెస్సీ మాత్రం ఏదో కోల్పోయినట్లు బాధలో ఉన్నాడు. ముఖంలో ఎక్కడా సంతోషం అనేదే కనిపించలేదు. అందరిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఫీలవుతున్నట్లు కనిపించాడు. ప్రోమో చూసిన నెటిజన్లు జెస్సీ అంత డల్ అవడానికి కారణమేంటని చర్చిస్తున్నారు. మళ్లీ ఎవరితోనైనా కయ్యం పెట్టుకున్నాడా? లేదా ఎలిమినేట్ అవుతానని భయం పట్టుకుందా? అని చర్చోపచర్చలు జరుపుతున్నారు.
ఇదిలా వుంటే జెస్సీ నేడు జైలుకు వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త లీకైంది. దీంతో జెస్సీ జైలుకు వెళ్లేంత నేరం ఏం చేసుంటాడా? అని ఆలోచిస్తున్నారు జనాలు. అయితే పండగ రోజే జెస్సీని జైలుకు పంపడమేంటని? ఇది నిజమయ్యే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు మరికొందరు. మరి జెస్సీ నిజంగానే జైలుకు వెళ్లాడా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment