
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ట్రోఫీ దక్కించుకునేందుకు కంటెస్టెంట్లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఎలాగోలా టాప్ 5లో స్థానం సంపాదించుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్ సుడిగండం నుంచి తప్పించుకోగలిగితే ఫైనల్ బెర్త్ ఖాయమైనట్లే. తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం వ్యాఖ్యాత నాగార్జున వారి సస్పెన్స్‌కు తెరదించబోతున్నారు. ఫినాలేలో అడుగుపెట్టనున్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఫినాలేలో తిష్ట వేసిన అఖిల్ ఏ భయం లేకుండా గుండెల మీద చెయ్యేసుకుని కళ్ల ముందు జరుగుతున్న విన్యాసాలను ప్రేక్షకుడిలా చూస్తున్నాడు. అయితే అఖిల్ కోసం ఫినాలే మెడల్ త్యాగం చేసిన సోహైల్ టాప్ 5లోకి వెళ్లిన రెండో కంటెస్టెంటు అని చెప్తున్నారు. అభి, అరియానా కూడా ఫైనల్‌కు వెళ్తున్నారు. (చదవండి: అరియానాను గెలిపించండి: వర్మ విన్నపం)
మిగిలిందల్లా హారిక, మోనాల్. డేంజర్ జోన్‌లో ఉన్న ఈ ఇద్దరిలో దేత్తడి సేఫ్ కాగా మోనాల్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఎన్నోవారాలు నామినేషన్‌లోకి వెళ్లిన ఆమె ఎలిమినేషన్ అంచుల వరకు వెళ్లి బయట పడ్డ సందర్భాలు కోకొల్లలు. కొన్నిసార్లైతే ఆమె కోసం కుమార్ సాయి, అవినాష్ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను పంపించేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఈ వారం మోనాల్ బిగ్‌బాస్.. మిగిల్చిన బాధలను, అపనిందలను మూటగట్టుకుని హౌస్ నుంచి వీడ్కోలు తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలన్న ఆమె కల అసంపూర్తిగానే మిగిలిపోయేలా ఉంది. మొదట్లో ఇద్దరబ్బాయి మధ్య నలిగిపోయిన ఆమె చివరికి ఒంటరిగా బయటకు వెళ్తోంది. అయితే ఈ ఎలిమినేషన్‌లో బిగ్‌బాస్ ఏదైనా ట్విస్టు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే గతవారం కూడా మొదట మోనాల్ ఎలిమినేట్ అయిందన్న వార్తలు వినిపించాయి. కానీ చివరికి ఎంటర్‌టైనర్ అవినాష్ వెళ్లిపోయాడు.ఇక ఈ వారం దేత్తడి పాప కూడా డేంజర్ జోన్‌లోనే ఉంది కాబట్టి ఆమెను పంపించేసి మోనాల్‌ను సేఫ్ చేసే అవకాశాలూ లేకపోలేదు. మరి ఏం జరగనుందనేది తెలియాలంటే నాగార్జున అధికారికంగా చెప్పేవరకు వెయిట్ చేయాల్సిందే! (చదవండి: విన్నర్ ఎవరో తేల్చేసిన హీరో శ్రీకాంత్)
Comments
Please login to add a commentAdd a comment