
Bigg Boss Telugu 5 Unseen, Priyanka story: స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి టాస్క్‌లో భాగంగా హౌస్‌మేట్స్ అంతా వారి జీవితాల్లో ఎదుర్కొన్న ఆటుపోట్లను పంచుకున్నారు. ఆ అడ్డంకులను దాటి చిరునవ్వుతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించిన విధానాన్ని వివరించారు. ఈ క్రమంలో ప్రియాంక సింగ్ తన జీవితం ఎలా మలుపు తిరిగిందో వివరించింది.
'ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. మా ఊర్లో అందరూ నన్ను తేజు, తేజు అని పిలిచేవారు. పెరిగేకొద్దీ నా జీవితంలో సమస్యలు చుట్టుముట్టాయి. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో మా అమ్మ తిరిగి వచ్చినట్లైంది. పెద్దయ్యేకొద్దీ ఊర్లో నామీద ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. నా ప్రవర్తనలో మార్పు వస్తోందని నాన్నతో చెప్పేవారు. పల్లెటూర్లో మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అప్పుడు నేను అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోవాలని ఫిక్సయ్యా!
మా నాన్న జేబులో నుంచి 50 రూపాయలు తీసుకుని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. కానీ అక్కడ హైదరాబాద్‌కు టికెట్ 75 రూపాయలు అని తెలిసింది. అమ్మో, అంత డబ్బు నా దగ్గర లేదని మళ్లీ ఇంటికెళ్లాను. అక్కడ దేవుడికి ముడుపు కట్టిన డబ్బులను తీసుకుని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్‌కు వచ్చేసరికి నా దగ్గర రెండు రూపాయలు మాత్రమే మిగిలాయి. ఒక రూపాయి కాయిన్‌తో మాదాపూర్‌లో ఉన్న చిన్నక్కకు ఫోన్ చేస్తే వాళ్లు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు.
అప్పుడు అనుకోకుండా ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది, చేశాను. ఆ తర్వాత అప్పారావు బాబాయి నువ్వు బాగున్నావు, లేడీ గెటప్ వేస్తావా? అని అడిగాడు. అమ్మాయిగా కనిపించాలనే కోరిక కూడా తీరుతుందని వెంటనే ఓకే చెప్పాను. అలా ఒక కామెడీ షోలో కెరీర్ స్టార్ట్ చేశాను. తేజు టీవీలో కనిపిస్తున్నాడంటూ ఊరంతా ప్రచారం జరిగింది. అలా నా సంపాదన రూ. 300 నుంచి లక్షల్లో ఆర్జించడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చింది పింకీ.
Comments
Please login to add a commentAdd a comment