చిత్ర పరిశ్రమలో వయసనేది పెద్ద సమస్యే కాదని నటి మనీషా కొయిరాలా(Manisha Koirala) అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు చేసే అవకాశం ఇవ్వాలి. వయసు, వృద్ధాప్యం అనేది సినిమా ఇండస్ట్రీలో పెద్ద సమస్య కాదు. కానీ, ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య.
ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోల వయసు గురించి ఎవరూ మాట్లాడరు. హీరోల ఏజ్‌పై కామెంట్స్ చేయడం నేనిప్పటి వరకూ వినలేదు. ఏజ్ విషయంలో కేవలం నటీమణులను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థం కావడం లేదు. సీనియర్‌లకు తల్లి పాత్రలో లేక సోదరి పాత్రలో ఇద్దామనుకుంటున్నారు. మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరు. యాక్షన్ పాత్రలని కూడా సులభంగా చేయగలరు.
గతంలో ఎంతో మంది సీనియర్ నటీమణులు ఈ విషయాన్ని నిరూపించారు. నేను కూడా ఇప్పటికీ ఎలాంటి పాత్ర అయినా సవాల్‌గా స్వీకరిస్తాను. కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే. యాభై సంవత్సరాలు దాటినా మంచి జీవితాన్ని గడపగలం. అసలు వయసనేది సమస్య కాదని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ విషయంలో భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలవాలి. నేను జీవించి ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలనుకుంటున్నా.. ఇదే ఆశయంతో జీవిస్తున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment