ఓటీటీలో అన్ని జానర్స్‌లో కొన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వయలెన్స్ అంటే ఇష్టపడేవాళ్లు బోలెడుమంది. అలాంటి ఆడియెన్స్ కోసమా అన్నట్లు గ్యాంగ్‌స్టర్, యాక్షన్ చిత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో టాప్ ప్లేసులో ఉండే మూవీ 'సిటీ ఆఫ్ గాడ్'. అయితే ఇది ఇంగ్లీష్ సినిమా కాదు. పోర్చుగీస్ భాషలో తీసిన బ్రెజిల్ మూవీ. కానీ ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో అంతలా ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో శివారులో ఉండే సిడాడె డె డెవుస్ మురికివాడ. కనీస అవసరాలైన విద్యుత్తు, రవాణా సదుపాయాలు అస్సలు ఉండవ్. చాలామంది కటిక పేదరికంలో ఉంటారు. ఇక్కడే 'టెండర్ ట్రయో' పేరుతో ముగ్గురు కుర్రాళ్లు.. దొంగతనం, దోపీడీలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటారు. పెద్ద హోటల్‌లో దోపీడీ చేస్తే ఇంకా ఎక్కువగా దోచుకోవచ్చని లిటిల్ డైస్ అనే పిల్లాడు సలహా ఇస్తాడు. రాత్రి అక్కడికే దొంగతనానికి వెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు.. పోలీసులు వస్తే సిగ్నల్ ఇవ్వమని లిటిల్ డైస్‌ని బయట కాపలా ఉంచుతారు.
దోపీడి మాత్రమే చేయాలని ఎవరినీ చంపకూడదని కుర్రాళ్లు అనుకుంటారు. కానీ లిటిల్ డైస్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్లు పారిపోతారు. తీరా మరుసటి రోజు పత్రికల్లో మాత్రం హోటల్‌లో చాలామంది చనిపోయినట్లు వార్తలు వస్తాయి. ఇంతకీ వాళ్లని ఎవరు చంపారు? చివరకు సిటీ ఆఫ్ గాడ్ అయిందెవరు అనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా తీసిన ఈ సినిమా.. ఫొటోగ్రాఫర్ అవ్వాలని కలలు కనే బుస్కేప్ అనే కుర్రాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ ముఠా, పోలీసులకు మధ్య ఇతడు ఇరుక్కునే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 1960లోకి వెళ్లి సిడాడె డె డెవుస్ అనే ఊరు. అక్కడి వాతావరణం, మనషులు ఎలా ఉంటారనేది చూపిస్తారు.
అప్పుడే యవ్వనంలోకి వచ్చిన కుర్రాళ్లంతా డ్రగ్స్ వ్యాపారంలోకి రావడం, ఇబ్బడిముబ్బడిగా డబ్బు పోగేసుకోవడం, వీటితో తుపాకులు కొని హత్యలతో చెలరేగడం ఇలా చాలా వయలెంట్‌గా ఉంటుంది. ఆధిపత్యం కోసం మొదటి రెండు తరాలు ఇలానే ఒకరిని ఒకరు కాల్చుకుని చనిపోతారు. మూడో తరం కూడా అలానే తయారవబోతుందని చూపించడంతో సినిమా ముగుస్తుంది.
ప్రాంతం గానీ, మనుషులు గానీ మనకు అస్సలు పరిచయం లేనివాళ్లు. కానీ చూస్తున్నంతసేపు బ్రెజిల్ శివారులోని మురికివాడల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఊపిరి సలపనంత స్పీడుగా ఉండే స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్లే ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేస్తుంది. ఇప్పుడంటే 'సలార్', 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసి ఆహా ఓహో అంటున్నారు. కానీ 2002లో గ్యాంగ్‌స్టర్ జానర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు.
ఇక సినిమా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే స్థానికులనే లీడ్ యాక్టర్స్‌గా పెట్టారు. 100 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరీ నటింపజేశారు. దాని ఫలితం మీకు సినిమాలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఫ్యామిలీతో కలిసి చూడకండి. ఎందుకంటే బూతులు, న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. మీకు వయలెన్స్ ఎక్కువగా ఉండే గ్యాంగ్‌స్టర్ మూవీ చూడాలనుకుంటే దీన్ని అసలు మిస్సవొద్దు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండింటిలోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
-చందు డొంకాన
Comments
Please login to add a commentAdd a comment