‘‘పాట పాడేటప్పుడు హీరోను ఊహించుకుంటూ ఆ వాయిస్‌లో పాట పాడతాం. అప్పుడే సందర్భానికి తగినట్లు పాట పండుద్ది. అలా ప్రతి గాయకుడిలో నటుడు ఉంటాడు. ఆ గాయకుడికి నటుడిగా అవకాశం దక్కినప్పుడు నిరూపించుకుంటాడు’’ అని గాయకుడు మనో అన్నారు. యాంకర్ శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వం వహించారు. గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలవుతోంది. మనో మాట్లాడుతూ–‘‘ఓ ఆడది ఓ మగాడు’ సినిమా ద్వారా దాసరిగారు నన్ను బాలనటుడిగా పరిచయం చేశారు.
‘రంగూన్ రౌడీ’, ‘నీడ’, ‘కేటుగాడు’ వంటి చిత్రాల్లోనూ బాలనటుడిగా చేశా. ఇక ‘క్రేజీ అంకుల్స్’ విషయానికొస్తే... ఇందులో బంగారు షాపు యజమాని పాత్ర నాది. తమ భార్యలు తమను సరిగ్గా పట్టించుకోవడం లేదని ముగ్గురు స్నేహితులు భావిస్తారు. ఆ సమయంలో ఓ లేడీ సింగర్‌తో ఏర్పడిన పరిచయం వల్ల వచ్చే సమస్యలేంటి? చివరకు ఎలా బయటపడతారు? అనేదే చిత్రకథ. నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యంగార్లలా కామెడీ ప్రధానంగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం రెండు, మూడు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment