
భారీ అంచనాలు పెట్టుకున్న లైగర్ డిజాస్టర్ కావడంతో సోషల్ మీడియాకు కొంత దూరంగా ఉంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తాజాగా అతడు ఓ కొత్త పాడ్‌క్యాస్ట్‌తో అభిమానులకు తన స్వరం వినిపించాడు. ఈసారి ఆయన తడ్కా గురించి మాట్లాడాడు. తడ్కా అంటే తాలింపు, పోపు. ఏంటి? పూరీ వంట మాస్టారు ఎప్పుడయ్యారనుకునేరు.. అయినదానికీ కానిదానికీ అనవసరమైన మాటలు జోడించి మంటపెట్టే వ్యవహారం గురించి మాట్లాడారాయన.
ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.. 'మనం ఓ మనిషిని ఇంకో మనిషి దగ్గరకు ఏదో పని మీద పంపిస్తాం. అతడు తిరిగొచ్చి ఏం జరిగిందో చెప్పడు. అవతలివాడు ఏమన్నాడో తప్ప మిగతాదంతా చెప్తాడు. అసలేమైంద్రా అంటే.. మంచిరోజులు కావన్నా.. నువ్వెంత చేశావు వాడికి.. వాడలా మాట్లాడటం నచ్చలేదు. నాలుగు డబ్బులు వచ్చేసరికి ఒళ్లు కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నాను కానీ, నువ్వైతే లాగి పెట్టి కొట్టేవాడివి అని చెప్పుకుంటూ పోతాడు. ఇంతకీ వాడు ఏమన్నాడ్రో చెప్రా అని అడిగితే ఇంకెప్పుడూ వాడి దగ్గరకు పంపించొద్దు, ప్లీజ్ అన్నా, వరస్ట్ ఫెలో వాడు.. ఇలా అడిగిన దానికి సమాధానం మాత్రం ఇవ్వడు. అది కాదురా, ముందు వాడేమన్నాడో మ్యాటర్ చెప్పు అని అడిగితే డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు అని బదులిస్తాడు
అంటే అక్కడ పెనంలో ఉన్నదాన్ని ఇక్కడికి తెచ్చేలోపు మనుషులు తాళింపు వేసి తీసుకొస్తారు. తాళింపు అంటే తడ్కా. జీవితంలో సగం గొడవలు తడ్కా వల్లే వస్తాయి. మధ్యవర్తులు జరిగింది చెప్తున్నారా? లేదంటే వాళ్ల అభిప్రాయం చెప్తున్నారా? అనేది గ్రహించాలి. డౌటొస్తే అడిగేయండి. మనందరం పుట్టుకతోనే వండటం నేర్చుకున్నాం. అలవోకగా తడ్కా పెట్టేస్తాం. ఇప్పటికైనా జరిగిందే చెప్పండి. నీ అభిప్రాయం అడిగినప్పుడే నీ మనసులో ఉన్నది కక్కేయండి, లేదంటే చావండి. అంతేకానీ మీరేమనుకుంటున్నారో ముందే చెప్పేయడం కుదరదు. తడ్కా వేసేది మనమే.. తడ్కా లేకుండా మనదగ్గరకి ఏ విషయం రాదు. దయచేసి తట్కాలు తగ్గిద్దాం.. అని సలహా ఇచ్చాడు పూరీ.
Comments
Please login to add a commentAdd a comment