డైరెక్టర్ శైలేష్ కొలను
‘‘హిట్ 2’ చిత్రం థ్రిల్లర్ జానర్ అయినప్పటికీ కుటుంబ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యేలా కథ రెడీ చేశాను. ఇందులో ప్రేమకథ కూడా కావాలని పెట్టింది కాదు. ఓ కేసును పోలీసాఫీసర్ టేకప్ చేస్తే ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అనేది చూపించాం’’ అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2’. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పిన విశేషాలు.
► నేను సిడ్నీ నుంచి వచ్చినప్పుడు నానీగారితో సినిమా తీయాలనుకున్నాను. ఆయనకు ‘హిట్’ కథ చెబితే, ‘నేను నటించను కానీ నిర్మిస్తా’ అన్నారు. అలా విశ్వక్ సేన్‌తో ‘హిట్ ది ఫస్ట్ కేస్’ తీశాం. ‘హిట్ ది సెకండ్ కేస్’కి అడివి శేష్ అయితే బాగుంటుందనుకున్నాను. నానీగారికి చెప్పగానే ఓకే అన్నారు. సినిమా గురించి మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అడివి శేష్‌కి ‘హిట్ ది సెకండ్ కేస్’ కథ చెప్పినప్పుడు స్వతహాగా తను కూడా రైటర్ కావడంతో ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఐదారు సిట్టింగ్స్ తర్వాతే ఓకే చెప్పారు. ∙‘హిట్’ ఫ్రాంచైజీని కొత్తగా ప్లాన్ చేశాం. ఒక్కో భాగంలో ఒక ఆఫీసర్‌ను పరిచయం చేస్తూ.. చివరకు అందరు ఆఫీసర్లను కలిపి ఓ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాను.
► నా సినిమాలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఇందుకు ఎంతో పరిశోధన చేస్తాను. ‘హిట్ ఫస్ట్ కేస్’ సమయంలో దిశ ఘటన జరిగింది. సెకండ్ కేస్ సమయంలో మళ్లీ ఇలాంటి (శ్రద్ధా వాకర్) ఘటన జరిగింది. అలాంటి క్రిమినల్స్ సమాజంలో ఉన్నారు. క్రిమినల్స్ ఎందుకు ఇలా మారతారు? అనే చర్చ మా సినిమాలో ఉంటుంది. ‘హిట్’ సీజన్ క్రియేట్ చేయమని రాజమౌళిగారు ఇచ్చిన సలహా మాకు నచ్చింది. ఇందుకు నానీగారు, ప్రశాంతిగారు ఓకే అంటే నేను ప్రతి ఏడాది ఇక హిట్ సినిమానే తీయాల్సి వస్తుంది(నవ్వుతూ).
► ‘హిట్ సెకండ్ కేస్’ తెలుగులో రిలీజయ్యాక హిందీలో డబ్ చేస్తాం. హిట్ ఫ్రాంచైజీ కాకుండా నా దగ్గర మూడు బౌండ్ స్క్రిప్ట్‌లు రెడీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment