వెబ్ సిరీస్ టైటిల్ : ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ సీజన్ 1 (7 ఎపిసోడ్స్)
నటీనటులు: సిద్ధాంత్ గుప్తా, చిరాక్ వోరా, రాజేంద్ర చావ్లా, ఆరిఫ్ జకారియా, లూక్ మెక్ గిబ్నే తదితరులు
నిర్మాతలు : మోనీషా అద్వాని , మధు భోజ్వాని, దనిష్ ఖాన్
దర్శకత్వం : నిఖిల్ అద్వాని
సంగీతం : అశుతోష్ పాఠక్
ఓటీటీ: సోనీలివ్(నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)
⇢ వెబ్ సిరీస్ ల సీజన్ లో కాస్త కొత్తగా ప్రయోగం చేయాలనుకుంటున్న వారు చరిత్రని సబ్జెక్ట్ గా ఎంచుకుంటున్నారు. మనకు తెలియని విషయాలను చెప్పడం వేరు, తెలిసిన విషయాలనే కొత్తగా చెప్పడం వేరు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మనకు తెలిసిన విషయంలోనే తెలియని కోణాన్ని ఆవిష్కరించడం మరో పద్ధతి. భారత స్వాతంత్ర పోరాటం గురించి మనందరికీ తెలుసు. అయితే స్వాతంత్రం సిద్ధించే దశలో, దేశ విభజన కూడా జరిగింది. ఆ విభజన గురించిన చరిత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ తీసిన వెబ్ సిరీస్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్.
⇢ గతంలో కూడా భారత స్వాతంత్ర పోరాటాన్ని చూపించే సినిమాలు, సీరియళ్లు, డాక్యుమెంటరీలు చాలానే వచ్చాయి. గాంధీ పాత్ర చిత్రీకరణతో చాలామంది ఆకట్టుకున్నారు. కానీ వాటన్నిటికంటే భిన్నంగా ఉంటుంది ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. భారత స్వాతంత్ర పోరాటం మొత్తాన్నీ ఈ వెబ్ సిరీస్ లో బంధించాలని చూడకుండా తన కథనాన్ని కేవలం 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు పరిమితం చేశాడు దర్శకుడు నిఖిల్ అద్వానీ. ఆయాపాత్రలకు ఎంపిక చేసుకున్న నటులు కూడా రాణించారు.
⇢ కీలక పాత్రలైన గాంధీ, నెహ్రూ, పటేల్, జిన్నాల భావోద్వేగాలు ఇందులో ఇంపార్టెంట్. ఆయా పాత్రలకు ఎంచుకున్న నటులు తమ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే వారి నుంచి ఆ స్థాయిలో ఔట్ పుట్ రాబట్టారు నిఖిల్ అద్వానీ. అందరి లక్ష్యం ఒక్కటే స్వాతంత్రం. కానీ అందులో దేశ విభజన కూడా జరగాలని కోరుకునేవారు, దేశం కలిసే ఉండాలనుకునేవారు ఉండటం.. వారి మధ్య జరిగే సంఘర్షణ, చివరకు మనకు తెలిసిన ఫలితాన్నే కొత్తగా చూపించడం ఆసక్తికరంగా ఉంది.
⇢ 1940-47 మధ్య జరిగే కథతో తెరకెక్కిన ఈ ఒరిజినల్ సిరీస్ లో స్క్రీన్ ప్లే ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. టైటిల్ వేయడానికి ముందు బ్యాక్ స్టోరీ (1917-1920) చెప్పడం.. టైటిల్ పడిన తర్వాత దేశ విభజన కాలం గురించి చర్చించడం ఆకట్టుకుంది. ఇందులో ఎవ్వర్నీ హీరోలుగా, విలన్లుగా చూపించే ప్రయత్నం చేయలేదు దర్శకుడు. ఎవరి వెర్షన్ ఏంటి.. ఎవరి భావజాలం ఎలా ఉందనే విషయాన్ని బలంగా చెప్పాడు. బ్రిటిషర్లు మాట్లాడే ఇంగ్లిష్ అక్కడక్కడ ఇబ్బంది పెట్టినప్పటికీ.. సబ్ టైటిల్స్ తో సిరీస్ చూసే అలవాటున్న ప్రేక్షకులకు అదేమంత పెద్ద ఇబ్బంది అనిపించదు.
⇢ ఈ వెబ్ సిరీస్‌లో మహాత్మా గాంధీగా చిరాగ్ వోహ్రా, జవహర్‌లాల్ నెహ్రూ గా సిద్ధాంత్ గుప్తా, వల్లభాయ్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, మహ్మద్ జిన్నాగా ఆరిఫ్ జకారియా, లూయిస్ మౌంట్ బాటన్‌గా ల్యూక్ మెక్ గిబ్నీ , లేడీ మౌంట్‌బాటన్‌కా డెర్డెలియా బుగేజా, సరోజినీ నాయుడు - మలిష్కా మెండోన్సా నటించారు.
⇢ ఇలాంటి కథనాలకు నటీనటుల ఎంపికతోపాటు వారి కాస్ట్యూమ్స్, అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే పరిసరాలు, భవనాలు కూడా ఇంపార్టెంట్. ఆ విషయంలో ఆయా విభాగాలు తమ టాలెంట్ చూపించాయి. 1940ల నాటి భారత దేశాన్ని కళ్లకు కట్టాయి. వైస్రాయ్ హౌస్, కాంగ్రెస్ కార్యాలయాలు, ఇతర ప్రాంతాలపై వెబ్ సిరీస్ టీమ్ బాగా పరిశోధన చేసిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment