Gautham Vasudev Menon Talks About The Life Of Muthu Movie - Sakshi
Sakshi News home page

గత చిత్రాలకు డిఫరెంట్‌గా ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు' ఉంటుంది: గౌతమ్‌ మీనన్‌ 

Published Sat, Sep 17 2022 6:14 PM | Last Updated on Sat, Sep 17 2022 8:06 PM

Gowtham Vasudevan Menon Talks About The Life Of Muthu Movie - Sakshi

శింబు హీరోగా  గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'వెందు తనిందదు కాడు'. ఇందులో సిద్దీ ఇధ్నానీ హీరోయిన్‌గా నటించింది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఇషారి. కె. గణేష్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రాన్ని 'ది లైఫ్ ఆఫ్ ముత్తు'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రసిద్ధ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్. నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ విడుదల చేశారు. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో తెలుగు మీడియాతో చిత్ర బృందం ముచ్చటించింది. 

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ ''తొలుత తెలుగులో ఈ సినిమా విడుదల చేయాలనే ఆలోచన లేదు. 'స్రవంతి' రవికిశోర్ గారు ఫోన్ చేశారు. 'నేను పాటలు విన్నాను. బావున్నాయి. ట్రైలర్ చూశా. నాకు నచ్చింది. తెలుగులో కూడా విడుదల చేద్దాం' అన్నారు. తమిళనాడులో ఒక పల్లెటూరిలో సినిమా కథ జరుగుతుంది. తెలుగులో విడుదల చేయాలనుకున్నప్పుడు... ఏ ఊరు అయితే బావుంటుంది? హీరో మాట్లాడే యాస ఎలా ఉండాలి? అని కొంత రీసెర్చ్ చేశాం. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం.

సాధారణంగా నేను రివ్యూలు చదవను. కొన్ని రివ్యూలలో 'గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరో బైక్ మీద తిరుగుతూ అమ్మాయితో పాటలు పాడుకుంటాడు' అని రాశారు. కానీ, ఈ సినిమాలో అవి ఏవీ లేవు. నేను ఇంతకు ముందు తీసిన సినిమాలకు డిఫరెంట్ సినిమా ఇది. శింబు కాబట్టి... సినిమాను ఇంత రియలిస్టిక్ గా చేశా. మరో హీరో అయితే స్టార్ డమ్, ఫ్యాన్స్ వంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని కొన్ని అంశాలు యాడ్ చేయాలి. శింబు అటువంటివి పట్టించుకోడు. నాకు అతనితో ఒక కంఫర్ట్ జోన్ ఉంది. సో... ఈజీగా చేశా.

 తమిళంలో పేరున్న రచయిత జయమోహన్ ఈ చిత్రానికి కథ అందించారు. ఆయన వైఫ్ కథ విని 'లవ్ స్టోరీస్ తీసే దర్శకుడికి లవ్ లేని కథ ఇచ్చావా?' అని అడిగారట. నాతో ఆ విషయం చెప్పేసరికి కథ నుంచి బయటకు వెళ్ళకుండా లవ్ సీన్స్ రాశాం. తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు వెల్లడిస్తా. 'స్రవంతి' రవికిశోర్ గారి నిర్మాణంలో రామ్ హీరోగా వచ్చే ఏడాది ఒక సినిమా చేస్తాను. నిజం చెప్పాలంటే... ఆ సినిమా కోసం జయమోహన్ గారితో డిస్కషన్స్ చేస్తున్న సమయంలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' కథ విని చేయడం జరిగింది. తెలుగులో సినిమా విజయం సాధించింది అంటే ఆ సక్సెస్ క్రెడిట్ ఆయనదే' అని అన్నారు. 

నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''గౌతమ్ మీనన్, నాకు మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేం ఒక సినిమా చేయాలనుకుంటున్నాం. ఆ సినిమా చర్చలో మధ్యలో 'ది లైఫ్ ఆఫ్ ముత్తు' గురించి తెలిసింది. నిజం చెప్పాలంటే... తమిళ్ వెర్షన్ విడుదలయ్యే వరకూ నేను సినిమా చూడలేదు. నాకు పూర్తిగా తెలియదు. మొన్న సినిమా చూశా. ప్రేక్షకులను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయాలని కాదు గానీ... నాకు సినిమా బాగా నచ్చింది. ఇంతకు ముందు మా సంస్థ ద్వారా 'నాయకుడు', 'పుష్పక విమానం' , 'రెండు తోకల పిట్ట', 'రఘువరన్ బీటెక్' చిత్రాలు విడుదల చేశాం. ఆ సినిమాల తరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది'' అని అన్నారు. 

హీరోయిన్ సిద్ధీ ఇధ్నానీ  మాట్లాడుతూ ''గౌతమ్ మీనన్ సినిమాలో కథానాయికగా నటించడం, ఈ రోజు ఆయన పక్కన కూర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో సినిమాను విడుదల చేసిన 'స్రవంతి' రవికిశోర్ గారికి థాంక్స్. శింబు, గౌతమ్ మీనన్, ఏఆర్ రెహమాన్ కలిసి సినిమా చేస్తున్నారని తెలిసి మా మేనేజర్‌కి పోస్టర్ స్క్రీన్ షాట్ పంపించా. అప్పటికి నాకు అవకాశం వస్తుందని అనుకోలేదు. తర్వాత నాకు అవకాశం రావడంతో మాటలు రాలేదు. తెలుగులో కొన్ని సినిమాలు చేశా. కొంత విరామం తర్వాత ఈ సినిమాతో విజయం అందుకోవడం సంతోషంగా ఉంది' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement