దర్శకుడు హరీశ్ శంకర్ స్టేజ్ ఎక్కితే ఎలా మాట్లాడుతాడో టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే. ఫుల్ పంచులు, కౌంటర్లతో అదరగొట్టేస్తాడు. మీడియాపై సైతం సెటైర్లు వేస్తుంటాడు. సందర్భం ఏదైనా.. తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు. తాజాగా ఈగల్ మూవీ సక్సెస్ మీట్‌లో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఘాటుగా స్పందించాడు.
‘నాకు గ్యాప్ వచ్చిందని.. తెల్లవార్లు తాగాడని..ఏదేదో రాస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్ సినిమాలు చేస్తున్నాను. త్వరలోనే పెద్ద హీరోలతో మరో రెండు సినిమాలు ప్లాన్ చేశాను. ఇవన్నీ మీకు(మీడియా) చెప్పి చేయాలా? ఇదేమన్నా ప్రొగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా ఫీజ్ కట్టావా..? నేను ఏం చేస్తున్నానో నీకు చూపించడానికి?. నాలుగు కాకపోతే ఐదేళ్లు కుదరదు. నీకు ప్రాబ్లమ్ ఏంటి? నీ ఇంటికి వచ్చి ఏమైనా అడుగుతున్నానా? నా రెంట్ కట్టండని. ట్రోలింగ్ మాకేం కొత్తకాదు. మేము సినిమా రంగంలోకి అడుగుపెట్టేటప్పుడే.. మా అమ్మనాన్నలే నాపై మొదట ట్రోల్ చేశారు. ‘హరీశ్ శంకర్ డైరెక్టర్ అవుతాడట.. వీడో పెద్ద మణిరత్నం మరి’ అని స్నేహితులు, బంధువులు ఎగతాళి చేశాయి. అవన్ని తట్టుకొనే ఇక్కడి వరకు వచ్చాం’ అని హరీశ్ అన్నారు.
సినిమాలకు ఇచ్చే రివ్యూలు..రేటింగ్‌లపై తన అభిప్రాయాన్ని తెలియస్తూ... ‘మేము ఏ సినిమా చేస్తున్నా.. హౌస్‌ఫుల్ కావాలని కోరుకుంటాం. మాకు ఎటువంటి అజెండాలు ఉండవు. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలనే రూల్ లేదు. విమర్శించే వాళ్లు విమర్శిస్తారు. పొగిడేవాళ్లు పొగుడుతారు.రివ్యూల్లో విమర్శ కనిపిస్తే ఓకేగానీ అది ఎగతాళి స్థాయికి వెళ్తోంది.ఎవరో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారంటే అర్థం ఉంది. మన రివ్యూస్ కూడా ట్రోల్ చేసే విధంగా ఉన్నందుకు బాధేస్తుంది.
సినీ జర్నలిస్టులు కూడా ఇండస్ట్రీలో ఒక భాగమే. మనం ఒకరిపై ఒకరం రాళ్లు వేసుకోవడమేంటి?నేను ఓ విలేకరికి కౌంటర్ ఇచ్చినందుకు నాకు వందల కాల్స్ వచ్చాయి. కౌంటర్‌కు ప్రశంసలేంటి? అని ఆలోచించా. నేను గొప్పగా ఏం మాట్లాడలేదు. సదరు జర్నలిస్టు పలు సందర్భాల్లో తప్పుగా మాట్లాడారు. అతనిపై ఉన్న కసిని కొందరు నాకు ప్రశంస అన్నట్లుగా మార్చారు. అది నాకు బాధ కలిగించింది’అని హరీశ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment