
సాక్షి ప్రతినిధి, చెన్నై: వెండితెరపై వెలుగులు నింపిన తొలితరం నటి రాజసులోచన. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా కూడా చిరపరిచితురాలు. అనేక మూఢ నమ్మకాలు, అపోహలు ఉన్న నాటి సమాజంలో మహిళగా నాట్యరంగం, సినీ రంగంతో పాటు బోట్, కారు డ్రైవింగ్ వంటి అంశాల్లోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తమ వాగ్దాటితో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు మార్గనిర్దేశం చేశారు. తద్వారా మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలితరం నటి రాజసులోచన ఘనతలను.. ఎదుగుదల క్రమంలో మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన తీరును.. ఆమె కవల కుమార్తెల్లో ఒకరైన దేవీకృష్ణ ‘సాక్షి’తో పంచుకున్నారు..
‘‘మాతల్లి వెండి తెరపై ప్రతిభ చూపగా.. తండ్రి చిత్తజల్లు శ్రీనివాసరావు (సీఎస్‌రావు)తెరవెనుక ఉంటూ అనేక మంది నటీనటులను వెలుగులోకి తెచ్చారు. మా సోదరి యూఎస్‌లో స్థిరపడగా నేను చెన్నైలో నివాసిస్తున్నాను. తాత రైల్వేలో పనిచేస్తూ ఉద్యోగరీత్యా అమ్మ చిన్నతనంలోనే చెన్నైకి వచ్చారు. కె.ఎన్.దండాయుధపాణి పిళ్లై వద్ద ఆమె భరతనాట్యం అభ్యసించింది. వయొలిన్, వీణలో కూడా ప్రవేశం ఉంది. స్వయంగా డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించి అందులో మాస్టరుగా కూచిపూడి వెంపటి చినసత్యాన్ని నియమించారు. అలాగే అమ్మ కూచిపూడి నృత్యాన్ని కూడా అభ్యసించారు. 1961లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం పేరుతో పాఠశాలను అమ్మ స్థాపించారు. యోగా, వ్యాయామం, సూర్య నమస్కారాలు, ఈత, కారు డ్రైవింగ్, బోట్ నడపడంలో విశేష ప్రతిభ చూపేవారు. బెంగళూరులో అమ్మ నాట్య ప్రదర్శనను చూసిన ఓ కన్నడ నిర్మాత సినిమాల్లో నటించాలని కోరారు. 1953లో గుణసాదరి అనే కన్నడ చిత్రం ద్వారా అమ్మ తెరంగేట్రం చేశారు. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 325కు పైగా సినిమాలు చేశారు. 1962లో అమ్మ రాజసులోచన.. మా నాన్న సీఎస్ రావును రెండో వివాహం చేసుకున్నారు’’ అని తెలిపారు.
తెరంగేట్రం అలా..
1966 జూలై 27న కవలపిల్లలుగా జన్మించాం. ఆ కాలంలో కవలలు పుట్టడం అరుదంట. అందుకే అమ్మకు డెలివరీ అయినప్పుడు సినీ ప్రముఖులంతా తరలివచ్చి మమ్మల్ని చూశారు. ఆ రోజుల్లో అన్ని భాషల మీడియాలో కూడా ఇది ఒక ప్రముఖ వార్తగా మారిందని.. మా తల్లిదండ్రులు చెప్పేవారు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి వెళ్లినప్పుడు దైవ సన్నిధిలో అదే మా అక్కచెల్లెళ్ల నాట్య ప్రదర్శనను చూసిన ఒక నిర్మాత పట్టుబట్టి మా ఇద్దరి చేత తెరంగేట్రం చేయించాడు. దేవుడు చేసిన పెళ్లి అనే చిత్రంలో నటి శారద ద్విపాత్రాభినయం చేశారు. ఆమె బాల్యం నాటి పాత్రను కవలలైన మేం చేశాం.
అమ్మ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు..
మా తల్లి అడుగుజాడల్లో నడుస్తూ సేవ, సంగీత కార్యాక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం నేను రోటరీ క్లబ్ 3232 డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నాను. మహిళా సభ్యులతో రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నై స్పాట్‌లైట్‌ను 2014 జూన్‌లో ప్రారంభించాను. దీనికి చార్టర్డ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాను. సహజంగా నేను గాయని కావడంతో 2013లో ‘ధ్వని ఎంటర్‌టైన్‌మెంట్’ అనే సంస్థను స్థాపించి ఈవెంట్ మేనేజిమెంట్ చేస్తున్నాను. మా నాన్న స్కృత్యర్థ్యం లాభాపేక్ష లేకుండా ‘నృత్య గాన లయ’ (ఎన్‌జీఎల్) ట్రస్ట్‌ను 2005లో నెలకొల్పి ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తున్నాను. యూఎస్‌లో స్థిరపడిన నా సోదరి శ్రీ గురుస్వామి సైతం గత 20 ఏళ్లుగా అక్కడ భారతీయ కుటుంబాలకు అవసరమైన సామాజిక సేవ చేస్తున్నారు. ‘సోషల్ వర్కర్ ఆఫ్ ది ఇయర్–2020–21’ అవార్డును ఆమె గత ఏడాది అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment