కల్పితాల కథ సినిమా. ఊహలకు ప్రతి రూపమే చిత్రం. అందుకే ఇది అందరికీ అందమైన రంగుల కల అయ్యింది. ఈ రంగుల ప్రపంచంలో స్థానం కోసం అందరూ శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు. అయితే ఎవరు ఎప్పుడు అందలం ఎక్కుతారో ఊహాతీతమే. ఇక్కడ పైకి వస్తారు అనుకున్న వాళ్లు కనుమరుగవుతారు.. సినిమాకు పనికి రారు అని అవమానాలను ఎదుర్కొన్న వారు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. ఇది సినీ జగం. ఇందుకు చిన్న ఉదాహరణ నటి పూజా హెగ్డే. ఈమె నటిగా దశాబ్దం పూర్తి చేసుకుంది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతోంది.
అయితే తనకు ఇవి అంత సులభంగా రాలేదంటుందీ అమ్మడు. అపజయాలకు కుంగిపోకుండా, మనస్తాపానికి గురి కాకుండా మనో ధైర్యంతోనే ముందుకు అడుగులు వేయడంతోనే ఈ స్థాయి సాధ్యమైందని పేర్కొంది. 2012 ముఖముడి అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది నటి పూజా హెగ్డే. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తరువాత 2014లో ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్‌లో ప్రవేశించింది. అక్కడా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత హిందీలో మొహంజదారో చిత్రంలో నటించింది. దీంతో బాలీవుడ్ ఆశలు అడియాశలే అ య్యాయి. అయినా మొక్కవోని ఆత్మస్థైర్యంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకే నడిచింది.
అందుకే ఇప్పుడు అగ్ర నటిగా వెలుగుతుంది. ఈ విషయాన్ని ఒక కార్యక్రమంలో ఆమె తెలిపింది. పై స్థాయికి చేరుకోవడానికి చాలా శ్రమించానని చెప్పింది. అయితే ఇప్పుడు తాను ఒక ప్రముఖ నటినని భావించలేదంది. స్టార్ నటిననే అంతస్తును తలకెక్కించుకోలేదని, ఇప్పటికీ నేల మీదే నిలబడ్డానని చెప్పింది. అయితే ఆదిలో తనను ఐరన్ లెగ్ అన్న వాళ్లే ఇప్పుడు నంబర్ వన్ హీరోయిన్ అంటున్నారని పేర్కొంది. సినిమా రంగంలో నంబర్ వన్ అనే అంతస్తు శాశ్వతం కాదన్న విషయం తనకు తెలుసంది. అందుకే దాని గురించి అస్సలు పట్టించుకోలేదని చెప్పింది. ఇక్కడ సరిగా నటించకపోతే ఎంతటి వారినైనా ప్రేక్షకులు ఇంటికి పంపించేస్తారని, వారికి నచ్చితే కొత్త వారిని కూడా ఉన్నత స్థాయిలో కూర్చొబెడుతారని నటి పూజా హెగ్డే పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment