
ఒక సినిమాకు కలెక్షన్లు రావాలంటే ఏం చేయాలి? అనగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల నుంచి ఠక్కున వచ్చే సమాధానం... భీభత్సంగా ప్రమోషన్ చేయాలి. సోషల్ మీడియాలో, టీవీ షోస్‌లో, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో, క్లబ్బులూ కాలేజీలనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎంత వీలైతే అంతగా ప్రమోట్ చేయాలి...
మరి అంత భారీగా ప్రమోషన్ చేసిన సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయ్? ఏ ప్రమోషన్ లేకుండా వచ్చిన సినిమాలు ఎందుకు కోట్లు కొల్లగొడుతున్నాయ్? అని అడిగితే మాత్రం సమాధానం దొరకదు. ఇటీవలే దీనిపై సీనియర్ బాలీవుడ్ నటుడు ఒకరు చేసిన విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది.
(చదవండి: తేళ్లు, బొద్దింకలు తిన్నాను.. తెలుగు హీరోయిన్)
ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ సీనియర్ హీరో, నటుడు జావేద్ జాఫ్రి(Jaaved Jaaferi ) మాట్లాడుతూ ఈ తరహా ప్రమోషన్లను ఏ మాత్రం పనికిరావంటూ తీసిపారేయడం విశేషం. రకరకాల మాధ్యమాల్లో మార్గాల్లో చేసే ప్రమోషన్లు వృధా ప్రయాసేనని ఆయన తేల్చేశాడు. స్టార్లను వెర్రిగా అభిమానిస్తారని అందరూ భావించే ఇన్‌స్టా ఫాలోయర్ల సంఖ్య సైతం కలెక్షన్లకు ఉపకరించదని స్పష్టం చేశాడు.
ఈ సందర్భంగా దబిడి దిబిడి నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rautela )ను ఉదాహరణగా పేర్కొంటూ ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో 72 మిలియన్ల మంది ఫాలోయర్లు కలిగి ఉన్నారని, ఆమె ఫాలోయర్లలో కోటి మంది అంటే 10 మిలియన్ల మందిని తీసుకున్నా, ఆ 1 కోటి మంది రూ. 250 సినిమా టికెట్ కొంటే ఆమె ప్రతీ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసేది కదా?అని ఆయన ప్రశ్నించాడు. ఇటీవల ఊర్వశి నందమూరి బాలకృష్ణతో తెలుగు చిత్రం డాకు మహారాజ్‌లో నటించింది అంతేకాక సినిమా ప్రమోషన్‌లో ఆమె చురుగ్గా పాల్గొంది కూడా.
అయితే కేవలం ప్రమోషన్లు మాత్రమే సినిమా విజయాన్ని ఖరారు చేయవని జావేద్ నొక్కిచెప్పారు. ‘‘మేం కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి కాలేజీలకు ఇంకా చాలా చోట్లకు వెళతాం. కానీ అది ఫలితాలను ఇవ్వదని చాలా సార్లు రుజువైంది’’ అని చెప్పిన ఆయన ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోషన్ చేయడంలో ఉత్సాహం చూపని రజనీకాంత్‌ను ఉదాహరణగా చూపించాడు.
‘‘రజనీకాంత్ సాబ్.. అతిపెద్ద స్టార్. ఆయన తన సినిమాను ఎక్కడ ప్రమోట్ చేస్తాడు? మరి ఆయన సినిమాలు కలెక్షన్లు ఎందుకు సాధిస్తున్నాయి?’’ అంటూ ప్రశ్నించాడు. మంచి సినిమా అయితే కొన్ని రోజుల పాటు రన్ అవుతుంది.ప్రమోషన్లు ఎంత చేసినా కానీ కొన్నిసార్లు కొంతమంది స్టార్‌లకు సరైన ఓపెనింగ్ కూడా లభించదు, ’’అని ఆయన చెప్పాడు.
సరే ప్రమోషన్లు వృధా ప్రయాసే అనుకుందాం. మరి కలెక్షన్లు రావాలంటే.. సరైన మార్గం ఏమిటి? అంటే ఆయన సమాధానం ట్రైలర్. అవును... సినిమా అమ్ముడుపోయేలా చేసేది ట్రైలర్ మాత్రమే. నాకు ట్రైలర్ నచ్చితే నేను సినిమా చూస్తాను, అంతే తప్ప హీరో/హీరోయిన్‌లు ఏదైనా టీవీ షోకి లేదా డ్యాన్స్ షోకి వచ్చి హడావిడి చేసినంత మాత్రాన నేను పట్టించుకోను. సో..ట్రైలర్ మాత్రమే సినిమాకి కలెక్షన్లను రప్పిస్తుంది ’’అని అంటూ జావేద్ జాఫ్రి చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment