
సినిమాల విషయంలో తగ్గేదేలే అంటున్నారు నటుడు జయం రవి. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించి అందరి ప్రశంసలను అందుకున్న ఈయన ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. జయం రవి, నయనతార జంటగా నటించిన ఇరైవన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
అలాగే ప్రస్తుతం సైరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్. అదే విధంగా దర్శకుడు రాజేష్ ఎం.దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, మరో నూతన దర్శకుడి సినిమాలోనూ నటించనున్నారు. ఈ పరిస్థితుల్లో జయం రవి మరో నూతన చిత్రానికి కమిట్ అయినట్లు తాజా సమాచారం. ఈయన ఇంతకు ముందు కార్తీక్ తగవేల్ దర్శకత్వంలో అడంగామరు అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది.
ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో భారీ చిత్రం తెరకెక్కబోతుంది. దర్శకుడు కార్తీక్ తంగవేల్ తాను రాసుకున్న కథను నటులు విశాల్, కార్తీలకు చెప్పి వారిలో ఒకరి నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసినట్లు, వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మళ్లీ నటుడు జయం రవినే ఆశ్రయించినట్లు సమాచారం. జయం రవి పచ్చజెండా ఊపడంతో దర్శకుడు కార్తీక్ తంగవేల్ షూటింగ్‌కు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిని ఏజీఎస్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
చదవండి: నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆ ఫోటో ఏంటి? మలైకాపై నెటిజన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment