
‘‘అగాథియా’(Agathiya) వైవిధ్యమైన చిత్రం. హారర్ అంశాలతో పాటు తల్లి సెంటిమెంట్, దేశభక్తి వంటి అంశాలు కూడా ఉంటాయి. ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారు. వారిని మా సినిమా నిరుత్సాహపరచదు’’ అని జీవా తెలిపారు. ప్రముఖ పాటల రచయిత పా.విజయ్ కథ అందించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘అగాథియా’. జీవా, రాశీఖన్నా జంటగా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అగాథియా’.
వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కె.గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మించిన ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జీవా విలేకరులతో మాట్లాడుతూ–‘‘మూడేళ్ల ప్రయాణం ‘అగాథియా’. ఎంతో కష్టపడి భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తీశాం. నా పాత్రతో పాటు అర్జున్ సర్, రాశీఖన్నా, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్... ఇలా అందరి పాత్రలను విజయ్‌గారు అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు.
కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసం చాలా రోజులు పట్టింది. యువన్ శంకర్ రాజాగారితో నా మూడో సినిమా ఇది. ఈ చిత్రం కోసం అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారాయన. దీపక్ కుమార్ పాడి విజువల్స్ సినిమాకి ప్లస్. ‘రంగం’ సినిమా నుంచి నన్ను ఎంతో ఆదరిస్తున్న తెలుగు వారికి థ్యాంక్స్. నేను నటించిన స్ట్రైట్ తెలుగు చిత్రం ‘యాత్ర 2’కి నటుడిగా మంచి పేరొచ్చింది. తెలుగులో నేరుగా మరో సినిమా చేయాలని నాకూ ఉంది. రచయితలు, దర్శకులు నా కోసం కథ సిద్ధం చేస్తే నేను రెడీ. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే ఉంది. రాజకీయాల ఆలోచన లేదు’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment