సీనియర్ జర్నలిస్ట్, సినీ పీఆర్వో అండా రామారావు ఇకలేరు. కర్నూలు జిల్లా ఆదోనిలోని స్వగృహంలో అనారోగ్యంతో ఆదివారం ఉదయం 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారాయన. డిగ్రీ పూర్తయ్యాక బీఎడ్ చేయాలనుకున్నా జర్నలిజంవైపు వచ్చారు. పలు అగ్ర దినపత్రికలతో పాటు సినీ వారపత్రికల్లోనూ పని చేశారాయన. ఘంటసాల వెంకటేశ్వరరావుపై వీరాభిమానంతో పలు వ్యాసాలు రాశారు.. కొందరి సహకారంతో ‘మీ ఘంటసాల’ పుస్తకాన్ని తెచ్చారు.
‘మ్యూజిక్ ఛానల్’ అనే మాస పత్రికను కొద్ది రోజులు నడిపారు రామారావు. ఆ తర్వాత నిర్మాత ఎమ్‌ఎస్. రెడ్డి వద్ద పీఆర్వోగా ఉన్నారు. ‘తెలుగు నిర్మాతల చరిత్ర’ పుస్తకం తీసుకురావడంలో నిర్మాత కె. మురారికి రామారావు సహకరించారు. గత ఏడాది హైదరాబాద్ నుంచి ఆదోని వెళ్లిన రామారావు ‘ఘంటసాల గానామృతం’, ‘యుగపురుషుడు యన్టీఆర్’ అనే వాట్సప్ గ్రూప్‌లకు అడ్మిన్‌గా ఉంటూ పాత చిత్రాల విశేషాలను పంచుకున్నారు. అండా రామారావు మృతి పట్ల పలువురు జర్నలిస్టులు తమ సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment